సాధారణంగా ఇల్లు అద్దెకు తీసుకునే సమయంలో ఆ ఇంటి యజమానికి ముందుగానే ఎంతో కొంత పేమెంట్ ని చెల్లిస్తూ ఉంటారు. హైదరాబాద్ బెంగళూరు వంటి పెద్ద పెద్ద మహానగరాల్లో ఎక్కువ మొత్తంలో చెల్లిస్తూ ఉంటారు. ఈ సెక్యూరిటీ డిపాజిట్ సామాన్యులకు పెద్ద భారమనే చెప్పవచ్చు. అయితే అటువంటి వారికి పరిష్కారంగా రెంటల్ బాండ్ అనే ఒక ప్రత్యేక విధానం అందుబాటులో ఉంది. ఈ రెంటల్ బాండ్ యజమానితో పాటుగా అద్దె తీసుకున్న వాళ్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అసలు ఈ రెంటల్ బాండ్ అంటే ఏమిటి అన్న విషయానికి.. ఇంటి యజమానులకు అద్దెకు తీసుకునేవాళ్లు ఇచ్చే ఆర్థిక భరోసానే రెంటల్ బాండ్ అంటారు.
అయితే ఈ రెంటల్ బాండ్ భారత్లో అంతగా ప్రాచుర్యం పొందలేదు. వీటిని జారీ చేయడం కోసం ప్రత్యేకంగా కంపెనీలు ఉంటాయి. ష్యూరిటీ ప్రొవైడర్లు కూడా వీటిని అద్దె తీసుకునేవారి తరఫున జారీ చేస్తుంటారు. కొంత ఫీజు చెల్లించి వాటిని పొందవచ్చు. అద్దెకు తీసుకునేవారి ఆర్థిక చరిత్రను పరిశీలించి బాండ్ ను జారీ చేస్తారు. ఇది యజమానికి ఒక భరోసా లాంటిది. అది ఎలా పని చేస్తుంది అన్న విషయానికి వస్తే.. ఒకవేళ అద్దెకు ఇల్లు తీసుకున్నవారు మధ్యలో ఎగవేస్తే బాండ్ లో ఇచ్చిన హామీ మొత్తాన్ని యజమానికి బాండ్ జారీ చేసిన సంస్థలే చెల్లిస్తాయి. తర్వాత ఆ మొత్తాన్ని బాండ్ తీసుకున్నవారి దగ్గరి నుంచి వసూలు చేస్తాయి.
బ్యాంకులు రుణాన్ని వసూలు చేసే సమయంలో అనుసరించే ప్రక్రియనే రెంటల్ బాండ్ జారీ సంస్థలు కూడా అవలంబిస్తాయి. దీనివల్ల యజమానులకు ఏంటి ప్రయోజనాలు అంటే.. ఒకవేళ అద్దెదారులు ఇంటి అద్దె సకాలంలో చెల్లించకపోయిన రెంటల్ బాండ్ ద్వారా దాన్ని రాబట్టుకోవచ్చు. లేదా ఇంటికి ఏదైనా డ్యామేజ్ చేసినా కూడా బాండ్‌లో పేర్కొన్న హామీ మొత్తం ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ఇంటిని అద్దెకు తీసుకున్న వారు కూడా ఆ బాండ్ పట్ల కట్టుబడి ఉండడంతో పాటు ఇంటిపట్ల బాధ్యతగా వ్యవహరించాలి. నిబంధనలు ఉల్లంగించినట్లైతే చట్ట పరంగా ఆ ఇంటి యజమానికీ రికవరీ చేసుకునే హక్కు ఉంటుంది. అలాగే అద్దె తీసుకునేవారికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. యజమాని కచ్చితంగా ఇంటికి ఎప్పటికప్పుడు కావాల్సిన మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది.
లేదంటే అద్దెదారులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఒక్కోసారి యజమానులు ఉన్నపళంగా ఇల్లు ఖాళీ చేయమని అంటుంటారు. అలాంటి సందర్భాల్లో అద్దెదారులు చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు బాండ్ ను ఉపయోగించుకోవచ్చు. ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలనన్నింటిని యజమాని కూడా పాటించాల్సి ఉంటుంది.ఒప్పందం ముగిసిన తర్వాత రెంటల్ బాండ్ ను అద్దెదారునికి యజమాని తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. తద్వారా తమ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ జరగలేదని అద్దె బకాయిలు లేవని యజమాని హామీ ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఈ రెంటల్ బాండ్ ద్వారా ఇంటి యజమానితో పాటు ఇంట్లో అద్దెకు దిగే వారికీ కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.