Electric Bikes: ఈ-స్కూటర్లు ఎందుకు పేలుతున్నాయంటే?

గత వారం రోజుల్లో ఆరు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు అగ్నిప్రమాదం జరగడంతో ఆ వాహనాలను నడిపేవారంతా భయపడుతున్నారు.

  • Written By:
  • Publish Date - April 5, 2022 / 12:45 PM IST

గత వారం రోజుల్లో ఆరు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు అగ్నిప్రమాదం జరగడంతో ఆ వాహనాలను నడిపేవారంతా భయపడుతున్నారు. కిందటి ఏడాది కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. కానీ ఇప్పుడు మాత్రం అవి సంచలనంగా మారాయి. దీంతో అసలీ సమస్యకు మూలకారణాలేంటో తెలుసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఈ-స్కూటర్లకు ఇప్పుడిప్పుడే మంచి క్రేజ్ వస్తోంది. పెట్రో మంటలను భరించలేక చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈరకం ప్రమాదాలు వారిలో ఆందోళనను పెంచుతున్నాయి.

వారం కిందట.. తమిళనాడులో ఛార్జింగ్ పెట్టిన ఈ-స్కూటర్ బ్యాటరీ పేలి తండ్రీకూతుళ్లు చనిపోయారు. చెన్నైలో పార్క్ చేసిన ఈ-స్కూటర్ లో మంటలు వచ్చాయి. తిరుచ్చిలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్యాటరీ పేలింది. మహారాష్ట్రలో పార్క్ చేసిన ఈ-స్కూటర్ లో మంటలు వచ్చాయి. ఇలాంటి ఘటనలను చూసి అందరిలోనూ ఆందోళన పెరిగింది. వీటికి లిథియం అయాన్ బ్యాటరీలే కారణమని ఉత్పత్తిదారులు చెబుతున్నా అది ఎంతవరకు నిజం? లిథియం అయాన్ బ్యాటరీల్లో మెకానిజం చాలా కష్టంగా ఉంటుంది. వీటిలో డెన్సిటీ.. అంటే విద్యుత్ సాంద్రత ఎక్కువ. ఇవి ఫుల్ ఛార్జ్ అయ్యాయా లేదా.. ఇంకా ఎంత ఛార్జింగ్ ఉందో తెలిపేది.. బీఎంఎస్ సిస్టమ్. దీనివల్లే డిస్ ప్లే బోర్డుపై ఈ వివరాలన్నీ కనిపిస్తాయి. ఒకవేళ బీఎంఎస్ సరిగా పనిచేయకపోతే బ్యాటరీ కండిషన్ ఏమిటో వాహనదారులకు తెలియదు. అందుకే బ్యాటరీ ఒకవేళ 90 నుంచి 100 డిగ్రీల స్థాయిలో వేడెక్కినా ఎలాంటి వార్నింగ్ అందదు. దీనివల్లే బ్యాటరీలు పేలే ప్రమాదముంటుంది.

కేవలం బీఎంఎస్ లోపాలే కాకుండా షార్ట్ సర్క్యూ్ట్, ఓల్టేజ్ హెచ్చుతగ్గులు కూడా బ్యాటరీలు పేలడానికి మరో కారణం. బ్యాటరీలను ఛార్జ్ చేసేటప్పుడు ఎర్త్ తప్పనిసరి. వైరింగ్ లో లోపాలు ఉన్నా షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదానికి ఆస్కారం ఉంటుంది. అసలు.. ఉత్పత్తిదారులు బ్యాటరీలకు టెస్టింగ్ నిర్వహిస్తున్నారా.. అదే జరిగితే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అన్నది మరో ప్రశ్న. ఇక లిథియం అయాన్ బ్యాటరీల విషయంలో ఇప్పటికీ లైసెన్సింగ్ కానీ, రిజిస్ట్రేషన్ కాని లేదని భారత నాణ్యతా ప్రమాణాల బ్యూరో-బీఐఎస్ చెబుతోంది. లిథియం అయాన్ బ్యాటరీలను కూడా దీని పరిధిలోకి తీసుకువస్తేనే భద్రతకు భరోసా వస్తుంది.