BJP : పుష్ప అంటే ఫ్లవర్‌ కాదు పవర్‌

గుజరాత్‌లో పుష్ప అంటే పవర్ అని నిరూపించారు మోదీ, షా ద్వయం. గుజరాత్‌లో కమలం పార్టీ అసాధారణ రీతిలో

  • Written By:
  • Publish Date - December 8, 2022 / 08:56 PM IST

గుజరాత్‌లో పుష్ప అంటే పవర్ అని నిరూపించారు మోదీ, షా ద్వయం. గుజరాత్‌లో కమలం పార్టీ అసాధారణ రీతిలో వికసించింది. తన రికార్డులను తానే బద్దలు కొట్టింది. ఒక రాష్ట్రంలో ఎక్కువ కాలం పాలించిన పార్టీగా ఉన్న సీపీఎం రికార్డ్‌ను బీజేపీ సమయం చేయబోతోంది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు కమలం… కమలం అంటే పుష్ప.. పుష్ప అంటే పవర్…ఇప్పుడు దేశంలో పుష్ప సీజన్ నడుస్తోంది. గుజరాత్‌లో అయితే కమలం పార్టీ హవా మామూలుగా లేదు. వరుసగా ఏడోసారి అధికారంలోకి వచ్చింది. అలాంటిలాంటి మెజారిటీ కాదు..అసాధారణ మెజారిటీతో…కాంగ్రెస్‌ను తుత్తునియలు చేసి..హస్తాన్ని పూర్తిగా ధ్వంసం చేసి కమలం వికసించింది. గోద్రా అల్లర్ల తర్వాత 2002లో మోదీ సారథ్యంలో జరిగిన తొలి ఎన్నికల్లో గుజరాత్‌లో 127 సీట్లతో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. 1985లో కాంగ్రెస్ పార్టీ 145 సీట్లు సాధించి అసాధారణ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ మెజారిటీని కూడా తలదన్నే విధంగా 150కి పైగా సీట్లతో కాషాయ పార్టీ ఏడో సారి అధికార పీఠం ఎక్కబోతోంది.

గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోందని ఆ మధ్య ప్రచారం జరిగింది. కాని దేశానికి సారథ్యం వహిస్తున్న నరేంద్ర మోదీ, అమిత్‌షా ద్వయం నాయకత్వం పట్ల గుజరాత్‌ ప్రజలు మరోసారి సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని సంపద అంతా గుజరాత్‌కి తరలిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న విమర్శ. అంబానీ, ఆదానీలో కూడా లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపిస్తున్నారు. విదేశాల నుంచి పెట్టబడిదారులు ఎవరొచ్చినా గుజరాత్‌కే మళ్ళిస్తున్నారనే విమర్శ కూడా ఉంది. గుజరాత్‌ కోసం మోదీ, షాలు ఇన్ని విమర్శలు ఎదుర్కొంటున్నపుడు వారి నాయకత్వాన్ని గుజరాత్ ప్రజలు ఎందుకు వదులుకుంటారనే ప్రశ్న బలంగా వినిపించింది. దానికి అనుగుణంగానే ఎన్నికల ఫలితాలువచ్చాయి.

2017 ఎన్నికల్లో 68.41 శాతం ఓట్లు పోలయ్యాయి. కాని ఈసారి నాలుగు శాతం పోలింగ్‌ తగ్గింది. కాని ఆశ్చర్యంగా అధికార బీజేపీ బలం 99 నుంచి అమాంతం 150 దాటిపోయింది. నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని అయినా ఆయన ఫోకస్ అంతా గుజరాత్‌ మీదే ఉంటుందన్న విమర్శలు తరచుగా వినిపిస్తుంటాయి. దానికి తగ్గట్టుగానే గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మీద ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాలు చాలా సీరియస్‌గా దృష్టి సారించారు. రాష్ట్రంలో కిలోమీటర్ల కొద్దీ రోడ్‌ షోలు నిర్వహించారు. గుజరాత్‌కు ఇప్పటివరకు ఏమి చేశారో..ఏమి చేయదలచుకున్నారో ప్రజలకు వివరించారు నరేంద్ర మోదీ. కాంగ్రెస్ బలహీనతలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రజలకు ఒరిగేదేమీలేదని స్పష్టంగా ప్రజలకు తెలియచేశారు.

పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రం. బీజేపీ ప్రభావం, పాకిస్తాన్‌పై ఉన్న వ్యతిరేక ప్రభావంతో గుజరాత్‌లో హిందుత్వ భావనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మోదీ, అమిత్‌షా వల్లనే తాము దేశాన్ని ఏలగలుగుతున్నామనే భావన కూడా గుజరాతీయలు బీజేపీ పట్ల అంత ఆకర్షణకు గురై ఉంటారనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. మెజారిటీ సామాజిక వర్గాలను బీజేపీ తనవైపు తిప్పుకుంది. పీసీసీ చీఫ్‌గా ఉన్న హార్థిక్‌ పటేల్‌ను బీజేపీ ఆకర్షించగలిగింది. ఎమ్మెల్యేగా గెలిపించింది. గత ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తుందా అనే అంత రేంజ్‌లో పోటీ ఇచ్చిన కాంగ్రెస్‌ను..ఈసారి ఎన్నికల ముందే చేతులెత్తేసేలా చేయగలిగారు మోదీ, షా ద్వయం. హార్థిక్ పటేల్‌ పార్టీని వదిలేయడం…ముఖ్యమంత్రి, గుజరాత్‌ బీజేపీ చీఫ్‌ కూడా పటేల్‌ వర్గమే కావడంతో ఈసారి పటేళ్లంతా గంపగుత్తగా కమలానికి ఓటేసారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గుజరాత్‌లో బీజేపీ తన రికార్డులను, కాంగ్రెస్ రికార్డులను కూడా బద్దలు కొట్టింది. వరుసగా ఏడుసార్లు గెలిచి 33 సంవత్సరాలు నిరంతరాయంగా బెంగాల్‌ రాష్ట్రాన్ని పాలించిన సీపీఎం జాతీయ రికార్డును కూడా బీజేపీ సమయం చేయబోతోంది. గుజరాత్‌ విజయంతో దేశమంతా కాషాయ సేన సంబరాలు చేసుకుంటోంది.