Monetary Policy: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ ఈ రోజు తన విధాన నిర్ణయాన్ని (Monetary Policy) ప్రకటించనుంది. FY24 ద్వైమాసిక, రెండవ ద్రవ్య విధాన సమావేశం జూన్ 6 నుండి 8 వరకు జరగనుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు ఈ సమాచారం ఇవ్వనున్నారు. శక్తికాంత దాస్ నేతృత్వంలోని రేట్ సెట్టింగ్ ప్యానెల్ ఈసారి కూడా రెపో రేటును 6.5 శాతం వద్ద ఉంచాలని భావిస్తుంది.
గత సమావేశంలోనూ రెపో రేటు నిలకడగా
RBI ద్రవ్య విధాన కమిటీ (MPC) ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశమవుతుంది. ఈ కమిటీ చివరి సమావేశం ఏప్రిల్‌లో జరిగింది. ఇందులో రెపో రేటులో ఎటువంటి మార్పు చేయకూడదని నిర్ణయించారు. ఆ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న రికవరీని కొనసాగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. అయితే అవసరమైతే రెపో రేటులో మార్పు సాధ్యమే.
రెపో రేటు ఇప్పటివరకు 250 బేసిస్ పాయింట్లు పెరిగింది
RBI మే 2022 నుండి ఫిబ్రవరి 2023 వరకు అంటే ఇప్పటివరకు 9 నెలల్లో రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. ప్రస్తుతం రెపో రేటు 6.5 శాతంగా ఉంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రోజు కూడా రెపో రేటులో ఎటువంటి మార్పు చేయకూడదని RBI గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చు.
రెపో రేటు అంటే ఏమిటి..?
వాస్తవానికి రెపో రేటు అనేది దేశంలోని బ్యాంకులకు RBI రుణాలు ఇచ్చే రేటు. దీని తరువాత ఈ రేటు ఆధారంగా బ్యాంక్ తన కస్టమర్లకు గృహ రుణం, వాహన రుణం, వ్యక్తిగత రుణం వంటి అనేక రకాల రుణాలను అందిస్తుంది. ఈ కారణంగా రెపో రేటులో మార్పు కారణంగా మీ లోన్, EMIపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది.