Jadeja: జయంత్ కోసం జడ్డూ త్యాగం

మొహాలీ టెస్టులో భారత గెలుపు వెనుక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాదే కీలకపాత్ర అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జడేజా బ్యాట్ తోనూ, బంతితోనూ అదరగొట్టాడు.

  • Written By:
  • Publish Date - March 7, 2022 / 03:41 PM IST

మొహాలీ టెస్టులో భారత గెలుపు వెనుక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాదే కీలకపాత్ర అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జడేజా బ్యాట్ తోనూ, బంతితోనూ అదరగొట్టాడు. గాయం నుండి కోలుకుని రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. బ్యాటింగ్ లో 175 రన్స్ చేసిన జడేజా రెండు ఇన్నింగ్స్ లలోనూ కలిపి 9 వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించాడు. ఇదే మ్యాచ్ లో మరో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా రాణించాడు. టెస్ట్ క్రికెట్ లో భారత్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు. తాజాగా జడేజా ప్రదర్శనపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నిస్సందేహంగా జడ్డూదే ఈ టెస్టు మ్యాచ్‌ అని , మొదట బ్యాటింగ్‌లో 175 నాటౌట్‌.. ఆ తర్వాత బౌలింగ్‌లో 9 వికెట్లు కూడా సాధించడం చిన్న విషయం కాదన్నాడు. అయితే జడేజా గురించి తెలియని ఓ విషయాన్ని అశ్విన్ పంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మూడో స్పిన్నర్‌గా జయంత్‌ యాదవ్‌కు అవకాశం ఇచ్చాడనీ, కానీ తమ ఇద్దరి వల్ల అతనికి ఎక్కువగా బౌలింగ్‌ వేసే అవకాశం లేకుండా పోయిందన్నారు.

అయినప్పటికి జట్టులో మూడో స్పిన్నర్‌ ఉన్నాడని గుర్తించడానికి జడేజా కొన్ని ఓవర్లను జయంత్‌ యాదవ్‌కు కేటాయించి త్యాగం చేశాడని గుర్తు చేశాడు. వాస్తవానికి జడేజాకు మరోసారి ఐదు వికెట్లు తీసే అవకాశం వచ్చి ఉండొచ్చని, అయితే లంక రెండో ఇన్నింగ్స్‌లో జయంత్‌ యాదవ్‌కు బౌలింగ్‌లో కొన్ని ఓవర్లు ఇవ్వడంతో జడేజా ఆ అవకాశాన్ని వదులుకున్నాడని అతనిది పెద్ద మనసంటూ ప్రశంసించాడు. ఈ విషయంలో జడేజా స్వయంగా రోహిత్‌తో మాట్లాడి జయంత్‌ యాదవ్‌కు బౌలింగ్ ఇప్పించిన విషయాన్ని యాష్ వెల్లడించాడు. తాను కూడా జడేజా నిర్ణయాన్ని సమర్థించానని చెప్పుకొచ్చాడు. జడేజా చెప్పినదాంట్లో నిజముందని.. జయంత్‌ను మూడో స్పిన్నర్‌గా జట్టులోకి తీసుకున్నామని.. అందుకే అతనితో బౌలింగ్‌ వేయించడానికి రెడీ అయ్యామంటూ చెప్పాడు. జట్టు ప్రయోజనాలతో పాటు సహచరుల గురించి కూడా ఆలోచించే వ్యక్తిగా జడేజా ఎప్పుడూ ఉంటాడని అశ్విన్ ప్రశంసించాడు.