Site icon HashtagU Telugu

Ashwin: కపిల్‌దేవ్ రికార్డును బ్రేక్ చేసిన అశ్విన్‌

Ashwin

Ashwin

మొహాలీ టెస్టులో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన మైలురాయి అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ రికార్డును యాష్ బ్రేక్ చేశాడు. శ్రీ‌లంక‌తో జరిగిన తొలి టెస్ట్ రెండో సెకండ్ ఇన్నింగ్స్‌లో అసలంకను ఔట్ చేయ‌డం ద్వారా అశ్విన్ ఈ రికార్డ్ సాధించాడు.

ఈ వికెట్‌తో కపిల్‌దేవ్ 434 వికెట్ల రికార్డును అధిగమించిన అశ్విన్‌ అత్యధిక వికెట్ల బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. టెస్ట్ ఫార్మేట్‌లో భారత్ తరపున ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 619 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడు యాష్ రెండో స్థానానికి దూసుకెళ్ళాడు. అశ్విన్ 85 టెస్టు మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును సాధించాడు. అలాగే టెస్టు క్రికెట్లో 400కు పైగా వికెట్లు తీసిన నాలుగో భార‌త బౌల‌ర్‌గానూ అశ్విన్ ఘనత సాధించాడు. కాగా ఇదే మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌల‌ర్ రిచర్డ్ హ్యడ్లీ (431) , శ్రీలంక బౌల‌ర్ రంగనా హెరాత్‌(432)ను సైతం అశ్విన్ అధిగ‌మించాడు.

ఇదిలా ఉంటే ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాకు సంబంధించి అశ్విన్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో లంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా… ఆసీస్ స్పిన్నర్ షేన్‌వార్న్ 708 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అటు ఇంగ్లాండ్ వెటనర్ బౌలర్ ఆండర్సన్ 640 వికెట్లతో మూడో స్థానంలోనూ , 619 వికెట్లతో అనిల్ కుంబ్లే నాలుగో స్థానంలోనూ ఉన్నారు. మెక్‌గ్రాత్, స్టువర్ట్ బ్రాడ్ , వాల్ష్, డేల్ స్టెయిన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.