Ravi Prakash: రాహుల్ తో రవి ప్రకాశ్ భేటీ.. వాట్ నెక్ట్స్!

ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానల్ TV9 మాజీ డైరెక్టర్ రవి ప్రకాశ్ చాలా రోజుల తర్వాత కనిపించారు.

  • Written By:
  • Updated On - May 7, 2022 / 06:14 PM IST

ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానల్ TV9 మాజీ డైరెక్టర్ రవి ప్రకాశ్ చాలా రోజుల తర్వాత కనిపించారు. శనివారం హైదరాబాద్‌లోని హోటల్‌ కోహినూర్‌లో కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌గాంధీతో రవిప్రకాష్‌ దాదాపు 30 నిమిషాల పాటు చర్చలు జరిపారు. వీరిద్దరి మధ్య ఏం జరిగిందనే విషయంపై క్లారిటీ లేదు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని సమకాలీన రాజకీయ పరిస్థితులను రాహుల్ కు వివరించినట్టు సమాచారం. న్యూఢిల్లీలోని తన నివాసానికి రవిప్రకాష్‌ను రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఆహ్వానించారని, త్వరలో మళ్లీ రాహుల్ ను కలుసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఎలా ఫేస్ చేయాలి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై రవిప్రకాష్ తన ఆలోచనలను రాహుల్‌తో పంచుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, రవిప్రకాష్ కొంతకాలం క్రితం భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారని వార్తలు వచ్చాయి. అయితే బీజేపీ నాయకత్వం నుండి పెద్దగా స్పందన లేదు. బీజేపీకి దగ్గరయ్యేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైన తర్వాతే రాహుల్‌ను కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. TV9 ప్రమోటర్ అయిన అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ABCL) కొత్త మేనేజ్‌మెంట్‌కి వ్యతిరేకంగా రవి ప్రకాష్ ప్రస్తుతం న్యాయ పోరాటం చేస్తున్నారు. ఫోర్జరీ, మోసం ఆరోపణలపై అరెస్ట్ అయి.. తరువాత విడుదలయ్యాడు. అప్పటి నుంచి బెయిల్‌పై ఉన్న ఆయన కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది.