Bhadrachalam: భక్తుల స‌మ‌క్షంలో భద్రాద్రి రాములోరి కళ్యాణం – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్య‌క్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి క‌ళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వ‌హిస్తామ‌ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

  • Written By:
  • Publish Date - March 15, 2022 / 11:52 PM IST

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్య‌క్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి క‌ళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వ‌హిస్తామ‌ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. సీయం కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఏప్రిల్ 10న శ్రీరామనవమిని పురస్కరించుకుని కళ్యాణోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులను అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. కళ్యాణ మహోత్సవం నిర్వహించే మిథిలా స్టేడియాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాల‌ని దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ కు ఆదేశాలు జారీ చేశారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఆలయ పరిసరాల్లో వెదురు తడికలతో కూడిన చలువ పందిళ్లను నిర్మించాల‌న్నారు. మ‌రోవైపు ఏప్రిల్‌ 2న శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ప్ర‌భుత్వ ఆద్వ‌ర్యంలో పంచాంగ శ్రవణం కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు.

గత రెండు సంవత్సరాలు కొవిడ్‌ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోనే కోవిడ్ నిబంధనలతో శ్రీరాముని కళ్యాణ వేడుకల‌ను, నిరాడంబ‌రంగా పంచాంగ శ్రవ‌ణ కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించామ‌ని, ప్రస్తుతం మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కనులపండువలా భక్తుల సమక్షంలో నిర్వహించనున్న‌ట్లు వెల్ల‌డించారు.