Rakesh Master Biography: రాకేష్ మాస్టర్ జీవితం ఇలా సాగింది

రాకేష్ మాస్టర్ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో 1968 జన్మించారు. ఆయన అసలు పేరు ఎస్. రామారావు. మొదట ఆయన ముక్కు రాజు మాస్టర్ దగ్గర పని చేశారు.అలా కొంతకాలానికే కొరియోగ్రాఫర్ గా మారాడు.

Published By: HashtagU Telugu Desk
Rakesh Master Biography

Rakesh Master

Rakesh Master Biography: ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి అంటారు. పేదరికంనుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితినుంచి పేదరికానికి మారిన వారినుద్ధేశించి ఈ సామెత వాడతారు. అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు ప్రముఖ డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్. ఒకప్పుడు ఖరీదైన భవనంలో ఉన్నాడు. చివరికి అనాథ శరణాలయంలోనూ గడిపాడు. ఇప్పుడు టాలీవుడ్ ని ఏలుతున్న ప్రభాస్, మహేష్ బాబు తదితర తారలు ఆయన దగ్గర డాన్స్ నేర్చుకున్నవారే. తెలుగులో దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రఫీ చేశాడు. ఢీ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న రాకేష్ మాస్టర్ అనతికాలంలోనే అత్యున్నత శిఖరాలకు చేరుకున్నాడు. అంతెందుకు ఇప్పుడున్న టాప్ కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఆయన వద్ద శిక్షణ తీసుకున్నవారే. రాకేష్ మాస్టర్ శిష్యులుగా పేరొందిన ఈ ఇద్దరు ప్రస్తుతం తెలుగు, తమిళంలో భారీ బడ్జెట్ చిత్రాలకు డాన్స్ మస్టర్లుగా కొనసాగుతున్నారు. ఇదంతా రాకేష్ మాస్టర్ జీవితంలో ఒక వైపు. మరోవైపు ఆయన దీన స్థితి కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ లో లక్షలు అద్దె కట్టిన రాకేష్ మాస్టర్ చివరి రోజుల్లో చిన్న చిన్న యూట్యూబర్స్ తో కాలం గడిపాడు.

రాకేష్ మాస్టర్ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో 1968 జన్మించారు. ఆయన అసలు పేరు ఎస్. రామారావు. మొదట ఆయన ముక్కు రాజు మాస్టర్ దగ్గర పని చేశారు.అలా కొంతకాలానికే కొరియోగ్రాఫర్ గా మారాడు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘దేవదాసు’, ‘చిరునవ్వుతో’, ‘సీతయ్య’, ‘అమ్మో పోలీసోళ్ళు’ వంటి హిట్‌ చిత్రాలకు రాకేశ్‌ కొరియోగ్రఫీ అందించారు. ముక్కుసూటిగా మాట్లాడటం అయన కెరీర్ పై ప్రభావం పడింది. రానురాను ఆయనకు సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. అయినా ఆయన కాళమ్మతల్లిని వదల్లేదు. సినిమా అంటే ప్రాణం ఇచ్చే రాకేష్ మాస్టర్ తన చివరి శ్వాస వరకు కళామతల్లిని పట్టుకునే ఉన్నాడు. సినిమా అవకాశాలు లేకపోవడంతో బ్రతుకు కష్టంగా మారింది. కొందరు సలహా మేరకు ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టి అందులో తన వీడియోలు, ఇంటర్వ్యూలు పెడుతూ కాలం గడిపాడు. కొన్ని రోజులు ప్రముఖ మీడియా ఛానెల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షోలోను రాకేష్ మాస్టర్ అలరించాడు.

రాకేష్ మాస్టర్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లోటు పాట్లను ఆయన బయటకు తీసే ప్రయత్నంలో భాగంగా స్టార్స్ ని వేలెత్తి చూపాడు. దీంతో అయన కుటుంబంపై అభిమానులు దాడి చేసిన దాఖలాలు ఉన్నాయి. దీంతో అతని భార్య, కొడుకు, కుమార్తె రాకేష్ మాస్టర్ ని వీడి దూరంగా బ్రతుకుతున్నారు. కుటుంబం దూరం కావడంతో రాకేష్ మాస్టర్ ఒంటరి వాడయ్యాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసగా మారాడు. ఇక ఆయన ఎన్నో సేవాకార్యక్రమాల్లో పాలు పంచుకున్నాడు. ముఖ్యంగా కరోనా సమయంలో అనేక సేవ కార్యక్రమాలు చేశాడు.

రాకేష్ మాస్టర్ ఓటిటీ సినిమా నిమిత్తం ఇటీవల ఆంధ్రప్రదేశ్ వెళ్లారు. అక్కడ ఓ విల్లాలో సినిమా షూటింగ్ జరిగింది. అయితే అక్కడ విపరీతంగా మద్యం సేవించినట్టు సహచరులు తెలిపారు. ఓ వైపు ఎండ వేడి, మరోవైపు కంటిన్యుగా మద్యం సేవించడం ఇది ఆయన ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపింది. అంతర్జాలంలో సమాచారం మేరకు రాకేష్ మాస్టర్ రెండు రోజుల్లో దాదాపుగా 20 ఫుల్ బాటిల్స్ తాగినట్టు తెలుస్తుంది. దీంతో ఆయన శరీరం డీహైడ్రేషన్ కి గురైంది. లోపల అవయవాలపై ఆ ప్రభావం పడింది. వారం రోజుల క్రితం ఏపీలో షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ వచ్చారు. వారం రోజులుగా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ నిన్న ఆదివారం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. దీంతో ఆయనను సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అప్పటికే ఆయన శరీర అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నట్టు గాంధీ వర్గాలు తెలిపాయి. దీంతో రాకేష్ మాస్టర్ ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మృతి చెందారు.

నన్ను అక్కడే సమాధి చేయండి!

రాకేష్ మాస్టర్ కొంత కాలంగా ఆయన ఆరోగ్యంపై కామెంట్స్ చేస్తూ వచ్చారు. తన బాడీలో మార్పులు వస్తున్నాయని ఇటీవల ఓ వీడియోలో చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. కాగా రాకేష్ మాస్టర్ చనిపోతే తన సమాధిని తన మామ సమాధి పక్కనే పూడ్చాలని ఆయన కోరుకున్నాడు. అతని మామ సమాధి పక్కన వేప చెట్టు నాటినట్టు, ఆ చెట్టు కిందా తనని సమాధి చేయాలనీ కోరుకున్నాడు.

Read More: Snakes Therapy : కొండ చిలువలు, బల్లులతో ట్రీట్మెంట్, మసాజ్

  Last Updated: 19 Jun 2023, 10:45 AM IST