Site icon HashtagU Telugu

Rajasthan CM: నిండు సభలో నవ్వులపాలైన రాజస్థాన్ సీఎం!

Ashok Rajasthan CM

Ashok

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం (Rajasthan CM) అశోక్ గెహ్లాట్ నిండు సభలో నవ్వుల పాలయ్యారు. శనివారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆయన గతేడాది బడ్జెట్ ప్రసంగంలోని కొన్ని భాగాలను చదవడంతో సభలో ఒక్కసారిగా కల్లోలం రేగింది. సీఎంకు వ్యతిరేకంగా ప్రతిపక్ష బీజేపీ పార్టీ సభ్యులు భారీ నిరసనకు తెరలేపారు. సభానిబంధనలు పాటించాలంటూ స్పీకర్ విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. దీంతో..సభను అరగంట పాటు వాయిదా వేయాల్సి వచ్చింది.

గతేడాది బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్న సీఎం గెహ్లాట్ వీడియోలను పలువురు బీజేపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. బీజేపీ నేషనల్ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్యా ట్విట్టర్ వేదికగా అశోక్ గెహ్లాట్‌ను విమర్శించారు. ‘‘రాజస్థాన్ ముఖ్యమంత్రి.. అందునా స్వయంగా ఆర్థికశాఖ మంత్రి అయ్యుండి కూడా గతేడాది బడ్జెట్ ప్రసంగాన్ని ఈ ఏడు సభలో మళ్లీ చదివారు. చీఫ్ విప్ మధ్యలో కలుగజేసుకుని సీఎం (Rajasthan CM) ప్రసంగాన్ని ఆపాల్సి వచ్చింది. ఇది తలవంపులు తెచ్చే ఘటన. ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో కాంగ్రెస్ ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ ఘటనతో బయటపడింది’’ అంటూ కామెంట్ చేశారు.

ఈ ఘటనపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే కూడా స్పందించారు. ‘‘ ఏకంగా 8 నిమిషాల పాటు సీఎం గెహ్లాట్ మునుపటి బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతూ పోయారు. నేను సీఎంగా ఉన్నప్పుడు పలుమార్లు బడ్జెట్ ప్రసంగాన్ని చెక్ చేసుకునే దాన్ని. దీనిని బట్టి.. రాష్ట్ర భవిష్యత్తు సీఎం చేతుల్లో ఎంత భద్రంగా ఉందో ఊహించుకోవచ్చు’’ అని వ్యాఖ్యానించారు.

మరోవైపు.. పొరపాటు జరిగిందని గుర్తించిన సీఎం గెహ్లాట్ సభకు క్షమాపణ చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలోని తొలి పేజీ మాత్రమే తప్పుగా ఉందని వివరించారు.

Also Read:  Shahrukh Khan: రూ. 4.98 కోట్ల విలువైన వాచీ ధరించిన షారుఖ్ ఖాన్