Hyderabad: హైదరాబాద్ నగర ప్రజలను ఈ రోజు చిరు జల్లులు పలకరించాయి. ఉదయం 9 గంటల ప్రాంతంలో నగరంలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. కాగా రాబోయే రెండు రోజుల వరకు నగరం మరియు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అలెర్ట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి పశ్చిమ, మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ఈ మార్పుకు కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తుకు చేరుకుంటుందని, ఈ నేపథ్యంలో రాబోయే రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా తూర్పు దిశ నుండి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. ఈ జల్లుల ప్రభావం యాదాద్రి – భోంగీర్, కాప్రా, ఘట్‌కేసర్, సరూర్‌నగర్, ఉప్పల్, మెహదీపట్నం మరియు మౌలాలి వంటి ప్రాంతాలతో సహా నగరం మరియు దాని శివార్లలో కనిపిస్తుంది. ఈ మేరకు రానున్న రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.