తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని బంగాళాఖాత తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. మయన్మార్, బంగ్లాదేశ్ దగ్గర ఉన్న మేఘాలను ఈ ఆవర్తనం ఆకర్షిస్తోందని.. వాటి ఫలితం తెలుగు రాష్ట్రాలపై పడనుందని అప్రమత్తం చేసింది. ఫలితంగా.. ఏపీతో పాటు, తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ విషయానికి వస్తే.. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ.. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు తెలంగాణలోని చాలా ప్రాంతాలు ప్రభావితం అయ్యాయి. వరంగల్ లాంటి ప్రాంతాల్లో అయితే వరదల్లో బోట్లు వేసుకుని మరీ జనాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ఇది గుర్తు చేసుకుంటున్న అధికారులు.. ఈ సారి వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తం అవుతున్నారు.