Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా గురువారం నుంచి తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలు మరో మూడ్రోజుల పాటు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. పలుప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 26వ తేదీ వరకు వర్షాలు పడతాయని.. అయితే భారీ వర్షాలు మాత్రం కురిసే అవకాశాలు లేవని వెల్లడించారు.
హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఉదయం వేళ మంచు ఉంటుందని వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో సగటున 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అధికంగా నల్లగొండ జిల్లా దామరచర్లలో 2.7 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. మెదక్‌లో 17 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆదిలాబాద్‌లో 17.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపు వీస్తున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.