Rahul Gandhi : నా పుట్టిన రోజు వేడుక‌లు జ‌ర‌పొద్దు – కార్య‌క‌ర్త‌ల‌కు రాహుల్ పిలుపు

  • Written By:
  • Publish Date - June 19, 2022 / 09:06 AM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సంద‌ర్భంగా వేడుక‌లు చేయ‌వ‌ద్ద‌ని ఆయ‌న క్యాడ‌ర్‌కు పిల‌పునిచ్చారు. ఆదివారం 52వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా అనేక రాష్ట్రాల్లో నిరసనలు తీవ్రం కావడంతో కోట్లాది మంది యువకులు వేదనకు గురవుతున్నారని.. ఎలాంటి వేడుకలకు దూరంగా ఉండాలని ఆయన తమ పార్టీ కార్యకర్తలను, శ్రేయోభిలాషులను కోరారు.

దేశంలో నెలకొన్న పరిస్థితులపై మేం ఆందోళన చెందుతున్నాం. కోట్లాది యువకులు వేదనకు గురవుతున్నారు. యువత, వారి కుటుంబాల బాధలను పంచుకుని వారికి అండగా నిలవాలి’ అని రాహుల్ గాంధీ తెలిపారు. . నాలుగు సంవత్సరాల పాటు సాయుధ దళాలలో సేవలందించేందుకు భారతీయ యువకుల నియామకం కోసం జూన్ 14న ఆమోదించిన కేంద్రం అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో రాహుల్ గాంధీ ఈ ప్రకటనచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లే, యువత డిమాండ్‌ను అంగీకరించి అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ శనివారం అన్నారు.

వరుసగా ఎనిమిదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం ‘జై జవాన్, జై కిసాన్’ విలువలను అవమానించిందని రాహుల్ ఆరోపించారు. “నల్ల వ్యవసాయ చట్టాలను ప్రధాని ఉపసంహరించుకోవాలని నేను ముందే చెప్పాను. అదే విధంగా, అతను ‘మాఫీవీర్’గా మారడం ద్వారా దేశంలోని యువత డిమాండ్‌ను అంగీకరించి.. ‘అగ్నిపథ్’ పథకాన్ని వెనక్కి తీసుకోవాలి’ అని రాహుల్‌ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.