Site icon HashtagU Telugu

SRH on Winning Spree: దుమ్ము రేపిన త్రిపాఠి, మక్రరమ్…సన్ రైజర్స్ హ్యాట్రిక్ విక్టరీ

sunrisers

sunrisers

ఐపీఎల్ 15వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం అందుకుంది. ఆసక్తికరంగా సాగిన పోరులో కోల్ కత్తా నైట్ రైడర్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్ లో నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ రాణిస్తే…బ్యాటింగ్ లో రాహుల్ త్రిపాఠి , మక్రరమ్ దుమ్ము రేపారు.
మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. సన్ రైజర్స్ పేసర్లు నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ చెరొక ఎండ్ నుంచీ కట్టడి చేయడంతో పరుగులు చేసేందుకు కోల్ కతా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ , ఫించ్ నిరాశపరిచారు. 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును నితీశ్ రాణా, ఆండ్రూ రస్సెల్ ఆదుకున్నారు.

ముఖ్యంగా రాణా చాలా కాలం తర్వాత తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు. భారీ షాట్లతో సన్ రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి సక్సెసయ్యాడు. ఈ క్రమంలో 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. చివర్లో రస్సెల్ మెరుపు బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. భారీ సిక్సర్లతో అభిమానులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చాడు. రస్సెల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 3 , ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు పడగొట్టాడు.

176 పరుగుల లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ కు ఈ సారి సరైన ఆరంభం లభించలేదు. ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ, కెప్టెన్ విలియమ్సన్ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. దీంతో సన్ రైజర్స్ 39 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడినట్టు కనిపించింది. ఈ దశలో యువ ఆటగాడు రాహుల్ త్రిపాఠీ మెరుపు ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. కోల్ కతా బౌలర్లపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడిన త్రిపాఠీ కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. త్రిపాఠీతో పాటు మర్ క్రమ్ కూడా ధాటిగా ఆడడంతో కోల్ కతా బౌలర్లు ప్రేక్షకుల్లా మిగిలారు. రాహుల్ త్రిపాఠీ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లో 4 భారీ సిక్సర్లు ఉన్నాయి.

త్రిపాఠీని రస్సెల్ పెవిలియన్ కు పంపడంతో హైదరాబాద్ కీలక వికెట్ చేజార్చుకుంది. త్రిపాఠీ 37 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. తర్వాత మక్రరమ్ , నికోలస్ పూరన్ హైదరాబాద్ విజయాన్ని పూర్తి చేశారు. మక్రరమ్ 36 బంతుల్లో 6 ఫోర్లు , 4 సిక్సర్లతో 68 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అతని జోరుతో హైదరాబాద్ మరో 13 బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ చేదించింది. ఈ సీజన్ లో సన్ రైజర్స్ కు వరుసగా ఇది మూడో విజయం.