Rahul Gandhi: టీమిండియా ఓటమి బాధ వెంటాడుతూనే ఉంది. మ్యాచ్ ముగిసి రెండు రోజులు గడుస్తున్నా ఆ బాధలోనుంచి బయటకు రాలేకపోతున్నారు. ఈ క్రమంలో సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు టీమిండియా ఓటమికి కారణాలేంటని విశ్లేషిస్తున్నారు. టీమ్‌ఇండియా ఓటమికి కారణాలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు దుష్ట శకునంస్టేడియానికి వచ్చిందని అన్నారు. అయితే ఆ దుష్ట శకునం ఎవరో దేశ ప్రజలకు తెలుసునని రాహుల్ వ్యాఖ్యానించారు.
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతను స్టేడియానికి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి 10 ఓవర్లలో 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో టీమ్ ఇండియా గెలుస్తుందని అందరూ అంచనా వేశారు. అయితే ఆస్ట్రేలియా ఆటగాళ్లు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు. మొత్తం టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన భారత బౌలర్లు ఫైనల్లో విఫలమయ్యారు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన షమీ ఫైనల్లో కూడా ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. దీంతో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో చెలరేగాడు. ఎట్టకేలకు భారత్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.