Rahul Gandhi : “మోడీ ఇంటిపేరు” వ్యాఖ్యకు సంబంధించిన క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది.
2019లో నమోదైన ఈ కేసులో రాహుల్ ను దోషిగా నిర్ధారిస్తూ గుజరాత్ లోని సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది.
ఆయన పార్లమెంటు సభ్యుని హోదాను పునరుద్ధరించింది.
జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
“నాయకులు బహిరంగంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాహుల్ (Rahul Gandhi) బాధ్యతగా మాట్లాడి ఉండాల్సింది” అని సుప్రీం కోర్టు బెంచ్ పేర్కొంది. ఇరుపక్షాల వాదనలు వినే క్రమంలో.. “రాహుల్ కు గరిష్ట శిక్ష ఎందుకు విధించారు” అని ఫిర్యాదుదారు పూర్ణేష్ మోడీ తరఫు న్యాయవాది మహేష్ జెఠ్మలానీని సుప్రీంకోర్టు బెంచ్ ప్రశ్నించింది. “తక్కువ శిక్ష విధించే అవకాశం ఉన్నా అలా చేయలేదు.. కనిష్టంగా 1 సంవత్సరం 11 నెలలు శిక్ష విధించి ఉండాల్సింది.. అలా తీర్పు ఇచ్చి ఉంటే రాహుల్ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు పడేది కాదు” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. “గుజరాత్ లోని సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు రాహుల్ గాంధీ రాజకీయ జీవితాన్ని కొనసాగించే హక్కును మాత్రమే కాకుండా, ఆయనను ఎన్నుకున్న ప్రజలను కూడా ప్రభావితం చేసింది” అని తెలిపింది. రాహుల్ తరఫున అభిషేక్ మను సింఘ్వీ, పూర్ణేశ్ మోడీ తరఫున మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో 3 గంటల పాటు వాదోపవాదనలు జరిగాయి.
Also read : Truecaller CEO-Trolled Woman : ఇండియాను వదిలేస్తానన్న స్టూడెంట్.. ట్రూకాలర్ సీఈఓ జాబ్ ఆఫర్
సింఘ్వీజీ, జెఠ్మలానీజీ మీ మాటల్ని రాజ్యసభ కోసం దాచి పెట్టండి
“ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అంతమాత్రాన.. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ 8 ఏళ్ల పాటు మౌనం వహించేలా తీర్పు ఇస్తారా ? ఆయన వ్యాఖ్య తీవ్రమైన నేరం కాదు. అది బెయిలబుల్ కేసు. నేను మేలో వాదనలు ముగించాను. ఇప్పటివరకు కేరళ ఎంపీ స్థానానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. అక్కడి నుంచి గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వారు భావిస్తున్నారు. అందుకే ఇలా చేస్తున్నారు” అని రాహుల్ (Rahul Gandhi) తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు బెంచ్ స్పందిస్తూ.. “ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దు. సింఘ్వీజీ, జెఠ్మలానీజీ మీరు మీ మాటల్ని రాజ్యసభ కోసం దాచి పెట్టండి” అని వ్యాఖ్యానించింది. “గరిష్ట శిక్ష కారణంగా ఒక లోక్ సభ సీటుకు ప్రాతినిధ్యం లేకుండా పోతుందని పరిగణించడం సరికాదు. ఇది కేవలం ఒక ఎంపీ హక్కులకే పరిమితమైన అంశం కాదు.. ఆ లోక్ సభ సీటు పరిధిలోని ఓటర్ల హక్కులకు సంబంధించిన అంశం కూడా. గరిష్ట శిక్ష ఎందుకు విధించారో ట్రయల్ జడ్జి చెప్పాల్సి ఉంది.. కానీ ఆయన దీనిపై ఏమీ చెప్పలేదు” అని సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది.
జస్టిస్ గవాయ్ తండ్రికి కాంగ్రెస్‌తో సంబంధం
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) జూలై 15న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం జూలై 21న తొలిసారి విచారణ చేపట్టింది. విచారణను ప్రారంభించే ముందు జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ.. తన తండ్రి కాంగ్రెస్‌తో సంబంధం కలిగి ఉన్నారని, తన సోదరుడు కూడా కాంగ్రెస్‌తో సంబంధం కలిగి ఉన్నారని చెప్పారు. అయితే దీనిపై ఇరు పార్టీలు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాయి.
Also Read : AB de Villiers: ఆర్సీబీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్న ఏబీ డివిలియర్స్.. ఈసారి ఆ పాత్రలో మిస్టర్ 360..?