Rahul Gandhi: ఈరోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టనున్న రాహుల్ గాంధీ..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఒక్కో దెబ్బ తగులుతోంది. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలు చేసిన కేసులో క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలిన 24 గంటల్లోనే లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్‌ను సభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - March 25, 2023 / 10:38 AM IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఒక్కో దెబ్బ తగులుతోంది. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలు చేసిన కేసులో క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలిన 24 గంటల్లోనే లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్‌ను సభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఈ చర్యకు వ్యతిరేకంగా రాజకీయంగా, న్యాయపరంగా పోరాడాలని కాంగ్రెస్ నిర్ణయించింది. నేడు దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ నిరసనలు చేపట్టనుంది. అందుకే మధ్యాహ్నం ఒంటి గంటకు రాహుల్ గాంధీ విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన మీడియాతో మాట్లానున్నట్టుగా కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

52 ఏళ్ల రాహుల్ గాంధీ తన నేరం, శిక్షపై హైకోర్టు నుండి స్టే ఆర్డర్ పొందకపోతే అతను వచ్చే ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. అనర్హత నోటిఫికేషన్ వెలువడడానికి కొన్ని గంటల ముందు రాహుల్ గాంధీ లోక్‌సభ కార్యక్రమాలకు హాజరయ్యారు. పార్లమెంట్ హౌస్‌లో పార్టీ ఎంపీల సమావేశానికి హాజరయ్యారు. ఒక ప్రజాప్రతినిధికి రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించబడి, ఆ శిక్షపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించినట్లయితే అతను ప్రజాప్రాతినిధ్య (RP) చట్టం ప్రకారం అనర్హత వేటును తప్పించుకోవచ్చు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ ఉపశమనం కోసం ముందుగా అప్పీల్ కోర్టును ఆశ్రయించవలసి ఉంటుంది. అతనికి అనుకూలంగా న్యాయపరమైన ఉత్తర్వు పొందిన తర్వాత అతను తన ఎంపీ హోదాను పునరుద్ధరించడానికి లోక్‌సభ సెక్రటేరియట్‌ను ఆశ్రయించవలసి ఉంటుంది.

Also Read: Cool Drinks: కూల్ డ్రింక్స్ వ్యాపారంలో స్వదేశీ విప్లవానికి రిలయన్స్ రెడీ..!

మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు గాను 2019లో బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలారులో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే రాహుల్‌ను సూరత్‌లోని కోర్టు గురువారం(జనవరి 23) దోషిగా తేల్చింది.

భారత ప్రజాస్వామ్యానికి ఇది బ్లాక్ డే అని, మోదీ ప్రభుత్వం ఈ ప్రణాళికాబద్ధమైన చర్యకు వ్యతిరేకంగా న్యాయ, రాజకీయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. అదే సమయంలో కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చిన బీజేపీ.. రాహుల్ గాంధీని లోక్ సభ సభ్యత్వం నుంచి తొలగించడం చట్ట ప్రకారమే జరిగిందని పేర్కొంది. రాహుల్ గాంధీ నాలుగోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో తొలిసారిగా అమేథీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన మరో రెండు పర్యాయాలు అమేథీకి ప్రాతినిధ్యం వహించారు. 2019లో వాయనాడ్‌లో గెలిచినప్పటికీ అమేథీ సీటును స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు.