Site icon HashtagU Telugu

Punjab Elections: పంజాబ్ సీఎంగా అమ‌రీంద‌ర్ సింగ్‌ని అందుకే తొలిగించాం – రాహుల్ గాంధీ

Amarinder Singh 759 Imresizer

Amarinder Singh 759 Imresizer

న్యూఢిల్లీ: పంజాబ్ సీఎంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ని తొలిగించ‌డంపై కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ మౌనం వీడారు. పంజాబ్ విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో ఆయ‌న విఫలమయ్యారని రాహుల్ గాంధీ మంగళవారం పేర్కొన్నారు. పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు ‘బిజెపితో సన్నిహిత సంబంధాలు’ ఉన్నాయని ఆరోపించారు.

పంజాబ్‌లో పేద ప్రజలకు ఉచిత విద్యుత్‌ను అందించడానికి నిరాకరించినందున కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను తొలిగించామ‌ని ఆయ‌న తెలిపారు. పంజాబ్ సీఎంగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ఎందుకు తొలగించారో నేను మీకు చెబుతాను. పేద ప్రజలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ఆయన అంగీకరించకపోవడమే ఇందుకు కారణమని రాహుల్ గాంధీ అన్నారు. అమరీందర్ సింగ్‌ను ‘అహంకారి’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

డ్రగ్స్ మహమ్మారి గురించి రాహుల్ ప్రస్తావిస్తూ, “డ్రగ్స్ దేశానికి ముప్పు అని తాను చెబుతూనే ఉన్నాన‌ని… పంజాబ్ ప్రయోగాలు చేయవలసిన రాష్ట్రం కాదన్నారు. మాదక ద్రవ్యాలు ఇక్కడి యువత జీవితాలను నాశనం చేయడం కొనసాగితే పంజాబ్‌లో అభివృద్ధి అర్థరహితం అవుతుందని ఆయ‌న అన్నారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో అధికార పోరుతో కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్ కాంగ్రెస్ సీఎంగా అమ‌రీంద‌ర్ పార్టీని విడిచిపెట్టి, తన సొంత రాజకీయ సంస్థ – పంజాబ్ లోక్ కాంగ్రెస్ (PLC)ని ప్రారంభించాడు. PLC ఇప్పుడు BJP మరియు సుఖ్‌దేవ్ సింగ్ ధిండా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్)తో పొత్తుతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.