Rahul Gandhi: కలకలం.. రాహుల్‌ గాంధీని చంపేస్తామని లేఖ..!

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని చంపేస్తామని ప్రత్యక్షమైన ఓ లేఖ కలకలం రేపింది.

  • Written By:
  • Updated On - November 18, 2022 / 04:07 PM IST

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని చంపేస్తామని ప్రత్యక్షమైన ఓ లేఖ కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ చేరుకోగానే బాంబు దాడి చేస్తామని హెచ్చరించారు. దాన్ని ఓ స్వీట్ షాపు వద్ద దుండగులు వదిలి వెళ్లారు. రాహుల్ రాగానే నగరం బాంబు దాడులతో దద్దరిల్లిపోతుందని పేర్కొన్నారు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు.

భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌కు రాకముందే రాహుల్ గాంధీని చంపేస్తామని పేరుతో బెదిరింపు లేఖ రావడం కలకలం రేపుతోంది. లేఖలో కాంగ్రెస్ నాయకుడిని బాంబుతో దాడి చేస్తామని బెదిరించారు. ఇండోర్ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ఇండోర్‌లో వాయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బాంబు బెదిరింపు లేఖ అందింది. శుక్రవారం ఉదయం ఓ మిఠాయి దుకాణం బయట గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపు లేఖను వదిలివెళ్లినట్లు సమాచారం. సమీపంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిజానికి ఆ లేఖలో రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ఇండోర్ చేరుకోగానే బాంబులతో దద్దరిల్లిపోతుందని ఆ లేఖలో బెదిరించారు. ఆ లేఖ వదిలిన అజ్ఞాత వ్యక్తిపై సెక్షన్ 507 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు ధృవీకరించారు.

నేడు భారత్ జోడో యాత్ర 72వ రోజు. కాంగ్రెస్ చేపట్టిన ఈ యాత్ర నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశించింది. ఇప్పటివరకు మహారాష్ట్రలోని నాందేడ్, హింగోలి, వాషిం, అకోలా జిల్లాల్లో పాదయాత్ర చేశారు. మహారాష్ట్రలో 12వ రోజు శుక్రవారం యాత్ర బాలాపూర్ (అకోలా జిల్లా) నుండి షెగావ్ (బుల్దానా జిల్లా)కి తరలివెళ్లింది. ఈ యాత్ర నవంబర్ 20న బుల్దానా జిల్లా (మహారాష్ట్ర)లోని జల్గావ్ జమోద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లోకి ప్రవేశిస్తుంది. దీని తర్వాత నవంబర్ 21న విశ్రాంతి తీసుకోనున్నారు. డిసెంబర్ 3న రాజస్థాన్‌లోని కోటా జిల్లాలోకి ఈ యాత్ర ప్రవేశించనుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన ఈ ‘భారత్ జోడో యాత్ర’ దాదాపు 150 రోజుల్లో 12 రాష్ట్రాల గుండా 3 వేల 570 కిలోమీటర్ల దూరం కొనసాగనుంది. ఈ యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే.