Site icon HashtagU Telugu

Raging : రామగుండంలో ర్యాగింగ్ కలకలం.. జూనియర్లకు గుండు కొట్టించిన సీనియర్లు

Ramagundam Medical College

Ramagundam Medical College

ర్యాగింగ్‌ భూతం మళ్లీ కురులు విప్పుకుంటోంది. గతంలో విచక్షణ రహితంగా విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడుతుండటంతో ర్యాగింగ్‌పై చట్టసభల్లోనూ చర్చలు చేసి చట్టాలు తీసుకువచ్చారు. దీంతో కొంతకాలంగా ర్యాగింగ్‌ భూతం కనిపించకుండా పోయినా.. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. విద్యార్థుల మధ్య మనస్పర్థలు కాస్త ర్యాగింగ్‌ రూపంలో బయటకు వస్తున్నాయి. దీంతో.. తోటి విద్యార్థులపై విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా.. ర్యాగింగ్‌ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. దీనికి నిదర్శనం ఇటీవల ర్యాగింగ్‌కు బాధితులైన ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలే. అయితే.. ఈ ర్యాగింగ్‌ కల్చర్‌ ఎక్కువగా మెడికల్‌ కాలేజీల్లో వెలుగుచూడటం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join.

మెడికల్‌ కాలేజీల్లో సీటు రావడం అంటే అంత చిన్నవిషయమేమి కాదు. అయితే.. అంత తెలివి తేటలు ఉండి తోటి విద్యార్థులను ర్యాగింగ్‌ రూపంలో హింసించడం చిన్న విషయమేమి కాదు. అయితే.. ఇప్పుడు ఈ ర్యాగింగ్‌ రక్కసి రామగుండంలో బయట పడింది. రామగుండం మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. సీనియర్ విద్యార్థులు ఇద్దరు జూనియర్లకు గుండు కొట్టించి, మీసాలు తీయించారు. జుట్టు ఎందుకు పెంచుతున్నావంటూ బలవంతంగా ట్రిమ్మర్తో గుండు చేసి మీసాలు తొలగించారు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థులు భయాందోళనకు గురై తమ ఇళ్లకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు వెళ్లి విచారణ చేపట్టారు.

సీనియర్ల ఆగడాలు మితిమీరిపోవడంతో జూనియర్లు ఆందోళన చేపట్టారు. కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ చాంబర్ ఎదుట నిరసన తెలియజేశారు. ర్యాగింగ్ చేసిన స్టూడెంట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు సీనియర్లు అంటే ఎంతో గౌరవమని చెప్పారు. వారిని ఎప్పుడూ సార్, మేడం అని పిలుస్తూనే ఉంటామని, అయినా ఇంతలా ర్యాగింగ్ చేయడం సరైందని కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ విషయంపై శాసనమండలిలో ప్రస్తావించేందుకు అనుమతి కోరారు. ర్యాగింగ్ అమానవీయమని, మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు. ర్యాగింగ్ చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Read Also : Narendra Modi : యూఏఈలో హిందూ ఆలయాన్ని ప్రారంభించనున్న మోడీ