Honeymoon Murder: హనీమూన్ హత్య కేసులో (Honeymoon Murder) సంచలన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. సోనమ్ రఘువంశీ, తన భర్త రాజా రఘువంశీని మేఘాలయలో హనీమూన్ సమయంలో హత్య చేయించినట్లు ఒప్పుకోవడంతో ఈ కేసులో పోలీసులు మరిన్ని సంచలన విషయాలను మీడియాకు తెలిపారు.
కామాఖ్య ఆలయ షరతు
సోనమ్, తన భర్త రాజాతో కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తయ్యే వరకు శారీరక సంబంధం ఉండదని షరతు పెట్టింది. ఈ సాకుతో ఆమె రాజాను అస్సాంలోని కామాఖ్య ఆలయానికి, ఆ తర్వాత మేఘాలయలోని నాంగ్రియాట్ ప్రాంతానికి తీసుకెళ్లింది. ఈ ప్రయాణం హత్య పథకంలో భాగమని పోలీసులు పేర్కొన్నారు.
హత్య పథకం
సోనమ్, తన ప్రియుడు రాజ్ కుశ్వాహాతో కలిసి రాజా రఘువంశీని హత్య చేయడానికి పథకం వేసింది. వారు ముగ్గురు కిరాయి హంతకులను (ఆకాశ్ రాజ్‌పుట్, విశాల్ సింగ్ చౌహాన్, ఆనంద్ కుర్మీ) నియమించారు. ఈ హత్యకు రూ. 20 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా సోనమ్ తన తాళిని, రింగ్‌ను రూమ్‌లో వదిలిపెట్టడంతో పోలీసుల ఆమెపై అనుమానం వ్యక్తం చేశారు. కొత్తగా పెళ్లైన మహిళలు ఎట్టి పరిస్థితుల్లో తాళి, రింగ్‌ను వదిలిపెట్టరని అనుమానించిన పోలీసులు ఆ దిశగా కేసు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: AP News : ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి.. ‘పేదల సేవలో’ నుంచి ‘తల్లికి వందనం’ వరకు..!
నాంగ్రియాట్‌లో హత్య
సోనమ్.. రాజాను నాంగ్రియాట్‌లోని దట్టమైన అడవుల్లోకి తీసుకెళ్లింది. అక్కడ పర్యాటకులు ఎక్కువగా ఉండటంతో ఆమె రాజాను వెయిసావ్‌డాంగ్ జలపాతం వద్దకు తీసుకెళ్లి, అక్కడ కిరాయి హంతకులచే హత్య చేయించింది. రాజా శరీరంపై రెండు పదునైన గాయాలు (తల ముందు, వెనుక భాగంలో) ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది.
సోనమ్ ప్రమేయం
సోనమ్ హత్య సమయంలో అక్కడే ఉండి, రాజా శవాన్ని లోయలో పడవేయడంలో కూడా సహాయం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె తన లోకేషన్‌ను రాజ్ కుశ్వాహాకు నిరంతరం పంపుతూ హంతకులకు రాజా ఆచూకీని అందించింది.
అరెస్ట్‌లు, రిమాండ్
సోనమ్, రాజ్ కుశ్వాహా, ముగ్గురు కిరాయి హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోనమ్ ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లో జూన్ 9న లొంగిపోయింది. అక్కడ ఆమె అస్వస్థతతో కనిపించింది. ఆమెను, ఇతర నిందితులను షిల్లాంగ్‌కు తరలించి, 8 రోజుల పోలీసు కస్టడీకి పంపారు. సోనమ్ సోదరుడు గోవింద్.. ఆమె నేరం రుజువైతే ఆమెను ఉరితీయాలని కోరాడు. అతను రాజా కుటుంబాన్ని కలిసి, తన సోదరి చేసిన పనికి క్షమాపణలు చెప్పాడు.