Puvvada vs Ponguleti: హీటెక్కుతున్న ‘ఖమ్మం’ రాజకీయాలు!

గోడ గడియారం. ఇప్పటికీ టైం ఎంత అయిందంటే అందరూ చూసేది వాల్‌క్లాక్‌ వైపే.

  • Written By:
  • Updated On - July 30, 2022 / 12:13 PM IST

గోడ గడియారం. ఇప్పటికీ టైం ఎంత అయిందంటే అందరూ చూసేది వాల్‌క్లాక్‌ వైపే. చేతికి వాచీ ఉన్నా.. ఇంకో చేతిలో సెల్‌ఫోన్‌ ఉన్నా.. వాల్‌క్లాక్‌ విలువ తక్కవేమీ కాదన్నది నిజం. రోజులో కనీసం నాలుగైదు సార్లయినా ప్రతి ఒక్కరూ వాల్‌క్లాక్‌ చూడ్డం చాలా చాలా కామన్‌. బహుశా అందుకేనేమో నేతలు ఇప్పుడా వాల్‌క్లాక్‌ పైన దృష్టి పెట్టారు. తమ తమ కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు వాల్‌క్లాక్‌లను రిటర్న్‌ గిఫ్ట్‌గా అందిస్తున్నారు. రిటర్న్‌ గిఫ్ట్‌ అంటే ఇదేదో ఫంక్షన్‌ను హాజరైతేనే ఇచ్చేది కూడా కాదు.. అసలు ఆహ్వాన పత్రికతో పాటుగానే దీన్ని ఇస్తున్నారంటే నేతలు ఎంత స్పీడ్‌గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇలా తమ అభిమాన నేతలు ఇచ్చిన వాల్‌క్లాక్‌ను దాదాపు అందరూ ఇళ్లలో జాగ్రత్తగా పెట్టుకుంటుంటారు. అయితే కొన్నికొన్ని సార్లు ఈ వాల్‌క్లాక్‌ల వల్ల ఖమ్మంలో కొత్త ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అసలు ఏంటీ వాల్‌క్లాక్‌ల కథ.. ఏం జరుగుతోందంటే..

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట శుభకార్యం. అదే విధంగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కుటుంబంలోనూ శుభకార్యం. ఇప్పుడు ఖమ్మంలో దాదాపు ప్రతి ఇంటికీ రెండు గోడ గడియారాలు వెళ్తున్నాయి. దాదాపు మూడేళ్ల క్రితం జరిగిన తన కుమారుడు హర్ష రెడ్డి వివాహానికి సైతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు నాలుగు లక్షల వాల్‌క్లాక్‌లు పంపిణీ చేశారు. అవి ఇప్పటికీ కొన్ని చోట్ల కనిపిస్తుంటాయి. అలాగే తాజాగా ఆయన కుమార్తెకు మాజీ ఎంపీ రామ సహాయం సురేందర్‌రెడ్డి మనుమడితో వివాహం నిశ్చయమైంది. ఆగస్టు 12న వివాహం ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో అంగరంగవైభవంగా జరగనుంది. అనంతరం హైదరాబాద్‌లోనూ, ఇటు ఖమ్మంలోనూ రిసెప్షన్‌ ఘనంగా జరపనున్నారు. దీనికోసం భారీ సెట్టింగులతో ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం ఐదు లక్షల మందికి భోజనం పెట్టాలన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు.

ఇక రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కుమారుడు డాక్టర్‌ నయన్‌రాజ్‌ వివాహం 20న హైదారాబాద్‌లోని జీఎంఆర్‌ ఎరీనాలో జరగనుంది. దీనికోసం మంత్రి అజయ్‌కుమార్‌ తన సతీమణి వసంతలక్ష్మితో కలసి ముఖ్యులకు ఆహ్వానాలు అందజేస్తున్నారు. అజయ్‌కుమార్‌ సైతం తన కుమారుని వివాహం కోసం అందిస్తున్నది కూడా వాల్‌క్లాక్‌ కావడం విశేషం. నాకుమారుడు నయన్‌రాజ్‌ వివాహం సందర్భంగా.. మీ పువ్వాడ అజయన్న.. అని పేర్కొంటూ తన నియోజకవర్గమైన ఖమ్మంలోని దాదాపు ప్రతి కుటుంబానికి అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అజయ్‌కుమార్‌ పంపిణీ చేస్తున్న వాల్‌క్లాక్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ల చిత్రాలను సైతం ముద్రించారు. అయితే మాజీ ఎంపీ పొంగులేటి మాత్రం ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని కుటుంబాలకు వాల్‌క్లాక్‌ అందేలా. ఏర్పాట్లు చేసుకున్నారు.ఆయన అభిమానులు ప్రతి ఊరిలో ఇంటింటికి వెళ్లి వాల్‌క్లాక్‌లను అందిస్తున్నారు.

ఇదంతా ఒకెత్తయితే ఈ వాల్‌క్లాక్‌ల పంపిణీ వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. కొనుగోలు చేయడం ఒకెత్తయితే, వీటిని మండలాలు, గ్రామాలు, ప్రతి ఇంటికీ చేర్చడం తలకుమించిన పనవుతోంది. దీనికోసం ఊరూరా, మండల స్థాయిలో, డివిజన్‌లలో పంపిణీ కమిటీల ఏర్పాటు, పర్యవేక్షణల పనులతో నేతలకు ఇక్కట్లు మొదలయ్యాయి. ఇక ఇద్దరూ తెరాసకు చెందిన వారే కావడంతో ఎవరిది ఇంట్లో పెట్టుకోవాలి.. ఎవరిది పక్కన పెట్టాలన్నది ఓ మీమాంస. తమ తమ నేతలు వారిళ్లల్లోని శుభకార్యానికి గుర్తుగా ఇస్తున్న గిఫ్ట్‌ కావడంతో ఎవరూ కాదనకుండా తీసుకుని గోడకు వేలాడదీస్తున్నారు. కొందరైతే మాకు ఇంకా కావాలి.. ఇంకా అందలేదన్న ఫిర్యాదులు కూడా చేస్తున్న దాఖలాలున్నాయి.