Site icon HashtagU Telugu

Puvvada: నిజ‌మైన రైతుబంధువు కేసీఆర్

Puvvada

Puvvada

యాసంగి వరిధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రైతులకు అండగా నిలిచారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం జిల్లాలోని రఘునాధపాలెం మండలం మంచుకొండ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతుల‌కు నిజ‌మైన రైతు బంధు కేసీఆర్ అని.. తెలంగాణకు శ్రీరామ రక్ష అని మంత్రి పువ్వాడ అజ‌య్ అన్నారు. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న రైతులను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని.. దీనిపై దేశవ్యాప్తంగా రైతు సంఘాలు తిరుగుబాటు చేయకముందే మోడీ ప్రభుత్వం మేలుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అండగా ఉంటూ యాసంగి వరిధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని మరోసారి హామీ ఇచ్చి రైతులను ఆదుకున్నారన్నారు. రూ.1960 మద్దతు ధరతో వరిని కొనుగోలు చేసి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయడం వీరోచిత నిర్ణయమ‌న్నారు.

తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ భూములకు సాగునీరు అందించేందుకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తోందని.. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు సమస్యలపై వ్యాపార దృక్పథంతో వ్యవహరిస్తోందని, ఆర్థిక ప్రయోజనాల కోసమే చూస్తోందని మంత్రి అజయ్‌కుమార్‌ అన్నారు. రైతులతో చిరకాల అనుబంధం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల ప్రయోజనాల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటారన్నారు. వరిసాగు చేయమని రైతులను బాధ్యతారాహిత్యంగా రెచ్చగొట్టిన బీజేపీ నేతలు రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. బీజేపీ నేతల కుటిల రాజకీయ వాక్చాతుర్యాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వరిని కొనుగోలు చేస్తారని.. రైతులు డిస్ట్రెస్ సేల్‌ను ఆశ్రయించాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వంపై రూ.15 వేల కోట్ల భారం పడాల్సి వచ్చినా రైతుల మేలు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి అజ‌య్‌ తెలిపారు.