హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకరమైన వ్యాఖ్యల కేసులో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఓల్డ్ సిటీలోని మొఘల్‌పురా ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి నిరసనకారులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేకు బెయిల్ ఇచ్చినందుకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు.
హైదరాబాద్ సిటీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసన జరుగుతుండగా కొంతమంది ఆందోళనకారులు మొఘల్‌పురా డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కారుపై రాళ్లు రువ్వారు. దీంతో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేస్తున్నారు. నగరంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను విశ్లేషించి శాంతి భద్రతలను కాపాడేందుకు సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో క్యాంపు ఏర్పాటు చేశారు.