Wrestlers Protest: సుప్రీం కోర్టులో రెజ్లర్ల ఇష్యూ

లైంగిక వేధింపుల కారణంగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై దేశంలోని ప్రముఖ రెజ్లర్లు నిరసనకు దిగారు.

Wrestlers Protest: లైంగిక వేధింపుల కారణంగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై దేశంలోని ప్రముఖ రెజ్లర్లు నిరసనకు దిగారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెండ్రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ మరియు మరో ఏడుగురు రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఏప్రిల్ 21న ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, ఈ విషయంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద ధర్నాలో కూర్చున్న రెజ్లర్ బజరంగ్ పునియా మాట్లాడుతూ.. ఫిర్యాదు చేసి 48 గంటలు దాటింది, కానీ ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. మా నిరసనకు అన్ని పార్టీలకు స్వాగతం. ఏ పార్టీ అయినా (బిజెపి , కాంగ్రెస్, ఆప్) రండి, అందరికీ స్వాగతం అంటూ ప్రకటించారు. అయితే బ్రిజ్ భూషణ్ సింగ్‌పై రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నుంచి కూడా పోలీసులు నివేదిక కోరారు.

మే 7వ తేదీన రెజ్లింగ్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 15 రోజుల ముందు నుంచే రెజ్లర్ల సమ్మెపై కొందరు ప్రశ్నలు సంధిస్తున్నారు. రెజ్లర్లు రాజకీయ ఉద్దేశంతో నిరసనకు దిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తమ నిరసనను రాజకీయ కోణంలో చూడవద్దని రెజ్లర్లు కోరుతున్నారు.

Read More: BJP-BRS : మంత్రి, ఎమ్మెల్యే మ‌ధ్య భూ భాగోతం