Site icon HashtagU Telugu

India: వస్త్రాలపై 12% జీఎస్టీ పెంపు పై నిరసనలు

Template 2021 12 31t155124

Template 2021 12 31t155124

టెక్స్‌టైల్స్‌పై ప్రస్తుతం 5 శాతంగా ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే అంటే రూ.1000 పెట్టి దుస్తులు కొంటే.. రూ.120 జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ పెంపును నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేనేత, మరమగ్గాల కార్మికులు, వస్త్ర వ్యాపారులు ఆందోళనకు దిగారు. పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి అవకాశాలు కల్పించేది వస్త్ర రంగమేనని.. అలాంటి రంగంపై జీఎస్టీ పెంపు సరికాదని నేత కార్మికులు, వ్యాపారులు చెబుతున్నారు.

జీఎస్టీ పెంపును నిరసిస్తూ చాలా ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేస్తున్నారు. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన 46వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. ఇందులో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు. అయితే గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, తమిళనాడు రాష్ట్రాలు వస్త్రాలపై జీఎస్టీ పెంపునకు తాము వ్యతిరేకమని ఇప్పటికే ప్రకటించాయి. 1 నుంచి జీఎస్టీ పెంపు అమలును ఆపాలని గుజరాత్‌ కోరింది. ఇదే విషయమై వ్యాపార వర్గాలు కూడా వినతి పత్రాలు సమర్పించాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.