Presidential Elections 2022: రాష్ట్రపతిగా గిరిపుత్రిక.. యశ్వంత్ సిన్హాపై ద్రౌపతి ముర్ము ఘనవిజయం

నవ భారతంలో కొత్త శకం. దేశ అత్యున్నత పీఠాన్ని ఓ ఆదివాసి మహిళ అధిరోహించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు.

  • Written By:
  • Updated On - July 21, 2022 / 09:54 PM IST

నవ భారతంలో కొత్త శకం. దేశ అత్యున్నత పీఠాన్ని ఓ ఆదివాసి మహిళ అధిరోహించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. ఈ నెల 25న 15వ రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టే రెండో మహిళగా ముర్ము నిలిచారు. ముర్ముకు బీజేపీ, NDA భాగస్వామ్యపక్షాలతోపాటు బీజేడీ, YSR కాంగ్రెస్‌ సహా 44 పార్టీలు మద్దతిచ్చాయి. దీంతో ఎలక్టోరల్ కాలేజ్‌లో అవసరమైన మెజార్టీకి మించి ఓట్లు సాధించారు ముర్ము. 63 శాతం ఓట్లతో విజయదుందుభి మోగించారు. ఇదిలా ఉంటే
అయితే రాష్ట్రపతి ఎన్నికలో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము అంచనాల కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. ద్రౌపది ముర్ముకు అనుకూలంగా విపక్షాల ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్‌లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది. 104 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్ వేశారు. కాగా మొత్తం 4,758 ఓట్లు పోలవగా.. 4,701 వాల్యుడ్ ఓట్లు, 53 ఇన్‌వాలీడ్‌గా తేలాయి. ఓటింగ్‌లో ముర్ముకు 2,824, యశ్వంత్ సిన్హా 1,877 ఓట్లు వచ్చాయి. ద్రౌపది ముర్ముకు 6,76,803 ఓట్ల విలువగా ఉంటే… ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు పోలైన ఓట్ల విలువ 3,80,177గా ఉంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అభినందనలు వెల్లువెత్తున్నాయి. 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్న ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మోదీతోపాటు ముర్ము నివాసానికి వెళ్లారు. కాసేపు ఆమెతో ముచ్చటించారు. మోదీ, నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఇతర పార్టీల రాజకీయ నేతలు, ప్రముఖులు కూడా ముర్ముకు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ద్రౌపది ముర్ము చేతిలో ఓడిపోయిన యశ్వంత్‌ సిన్హా కూడా ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఈ నెల 25న మొదటి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముర్ము విజయంతో ఒడిశాలోని ఆమె స్వగ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.