PK: కాంగ్రెస్ కు ప్లస్సా.. మైనస్సా?

అబ్బో.. ఒకటీ రెండూ కాదు.. ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ సమాధానాలే కరువవుతున్నాయి.

  • Written By:
  • Updated On - April 23, 2022 / 12:20 PM IST

అబ్బో.. ఒకటీ రెండూ కాదు.. ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ సమాధానాలే కరువవుతున్నాయి. కొద్దిరోజులుగా ప్రశాంత్ కిషోర్.. సోనియా టీమ్ తో వరుసగా భేటీ అవుతున్నారు. ఆయనిచ్చిన బ్లూప్రింట్ కాంగ్రెస్ కు నచ్చింది. అది కాంగ్రెస్ పార్టీని ఎలా సంస్కరించాలో మాత్రమే చెప్పింది. మరి బీజేపీని ఓడించడం ఎలా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షులు, కార్యదర్శులు, కమ్యూనికేషన్ విభాగానికి అధిపతులు ఎలాంటి వారుండాలో పీకే చెప్పారు. అలాగే క్షేత్రస్థాయి సంస్కరణల మీద ఆయనిచ్చిన ప్రజంటేషన్ కు కాంగ్రెస్ ఫిదా అయ్యింది. కానీ బీజేపీని ఓడించడానికి దీనికి సంబంధం లేదు. మరి కమలాన్ని హస్తంతో ఢీకొట్టాలంటే ఏమిటి మార్గం? పీకే ఇచ్చిన మాస్టర్ ప్లానేంటి?

ప్రధాని మోదీ శక్తివంతమైన నాయకుడేమీ కాదని.. సరైన ప్రతిపక్షం లేకపోవడం వల్లే ఆయన బలవంతుడిగా కనిపిస్తున్నారన్నది పీకే అభిప్రాయం. 2014కు ముందు సేమ్ సీన్. అప్పుడు కాంగ్రెస్ వైఫల్యాలు, అవినీతి ఆరోపణలను చూపిస్తూ.. మోదీని ప్రభావవంతమైన నాయకుడిగా పీకే చూపించాడు. అందుకే మోదీ అంతెత్తున కనిపించారు ప్రజలకు. ఇప్పుడు సేమ్ స్ట్రాటజీని రాహుల్ కోసం అనుసరించబోతున్నారని టాక్. ప్రధాని మోదీ పాపులారిటీని దెబ్బతీయాలంటే.. ముందుగా రాహుల్ గాంధీ ఇమేజ్ ను పెంచాలి. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయననే నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం పీకే ఒక బ్లూప్రింట్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. రాహుల్ ఎంతటివాడో, ఎలాంటివాడో.. ప్రధానిగా అయితే దేశానికి ఏం చేయగలడో అన్న విషయాన్ని పాజిటివ్ గా చెప్పే ప్రయత్నం చేయబోతున్నట్టు సమాచారం.

ఇదే క్రమంలో ప్రధాని మోదీ నిజస్వరూపం ఏమిటో.. వివిధ రంగాల్లో ఆయన ఎంత ఘోరంగా విఫలమయ్యారో.. ప్రభుత్వ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో చూపించేలా.. అందరికీ అర్థమయ్యేలా, తెలిసొచ్చేలా చేయడానికి పీకే రెండు నినాదాలను తయారుచేశారు. అవి ‘హానికారక్ మోదీ’, ‘మోదీ జానేవాలే హై’. కానీ వీటిని ఉపయోగిస్తే ప్రజలు మోదీని తిరస్కరిస్తారా? రాహుల్ ను ఆహ్వానిస్తారా అన్నది ఇప్పుడే చెప్పలేం. మరి పీకే మాస్టర్ ప్లాన్ కు కాంగ్రెస్ ఏమంటుందో చూడాలి.