దేశంలో 2024 ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో జాతీయ పార్టీల్లో ఒకటైన కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఒక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌కు కనీస సీట్లు దక్కలేదు. దీంతో 70 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక కోలుకోవడం కష్టమని రాజకీయ విశ్లేషకులు సైతం తేల్చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి చుక్కలు చూపిస్తుందని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు.
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, అధికార బీజేపీకి ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదుగుతుందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. కాంగ్రెస్ తమ నేతలను ఏకతాటిపైకి తెస్తే, బీజేపీకి చెమటలు పట్టించడం ఖాయమని ప్రశాంత్ కిశోర్ అన్నారు. కాంగ్రెస్‌కు పునర్జన్మ ఇవ్వాల్సిన అవసరం ఉందని పీకే అన్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవకాశం ఉందని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ప్రస్తుతం బీజేపీ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ బీహార్, బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి తూర్పు, దక్షిణ భారతదేశంలోని దాదాపు 200 స్థానాల్లో బీజేపీ 50 సీట్లు సాధించలేకపోతుందని ప్రశాంత్ కిషోర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలంగా ఒకే తాటిపైకి వస్తే బీజేపీని ఓడించడం పెద్ద కష్టం కాదని ప్రశాంత్ కిషోర్ తేల్చిచెప్పారు.