Prashant Kishor: కాంగ్రెస్ కు  నా అవసరం లేదనిపించింది!

కాంగ్రెస్ లో పీకే టెన్షన్ ఇంకా తగ్గలేదు. అటు ప్రశాంత్ కిషోర్ కూడా తన అటెన్షన్ మార్చలేదు.

  • Written By:
  • Updated On - April 29, 2022 / 10:36 PM IST

కాంగ్రెస్ లో పీకే టెన్షన్ ఇంకా తగ్గలేదు. అటు ప్రశాంత్ కిషోర్ కూడా తన అటెన్షన్ మార్చలేదు. అందుకే కాంగ్రెస్ కు తన అవసరం లేదని సింపుల్ గా స్టేట్ మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తనకు తాను పునర్వైభవాన్ని సంతరించుకోగలదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి పీకే తో కాంగ్రెస్ పెద్దలు పలుమార్లు భేటీ అయ్యారు. అయితే ఆ మీటింగుల్లో చర్చించిన చాలా అంశాల్లో రెండు వర్గాలకు మధ్య అంగీకారం కుదిరింది. మరి పీకే ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు? ఇది కాంగ్రెస్ వర్గాలతోపాటు దేశంలో కోట్లాదిమందిని వేధిస్తున్న ప్రశ్న.

ప్రశాంత్ కిషోర్ చెప్పిన అంశాలు, కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు అన్నీ ఆ మీటింగుల్లోనే ఓ కొలిక్కి వచ్చాయి. అయితే ఆ పార్టీలో తలపండిన నేతలు చాలామంది ఉన్నారని.. అవన్నీ వాళ్లు చేసుకోగలరని.. అందుకే కాంగ్రెస్ పార్టీకి తన అవసరం లేదని భావిస్తున్నట్టు పీకే చెప్పారు. దీనివల్లే పార్టీలోకి తనను రమ్మని అగ్రనేతలు కోరినా రానని చెప్పానన్నారు. పీకే ఈ మాటలు మనస్ఫూర్తిగా చెప్పారా… వ్యంగ్యంగా అన్నారా అన్నది కాంగ్రెస్ నేతలకు అర్థమవుతుంది. కాంగ్రెస్ ఏఏ విధానాలతో ముందుకెళితే విజయం సాధించగలదు అన్నదానిపై తాను బ్లూప్రింట్ ఇచ్చానని దానిని కచ్చితంగా అమలు చేయాలని కోరానని అన్నారు.

తాను కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పాలనుకున్నానో అది చెప్పేశానన్నారు పీకే. 2014 తరువాత కాంగ్రెస్ పార్టీ తన ప్రణాళికలన్ని బాగానే చర్చించింది. కాకపోతే దానిని అమలు చేసే సాధికారత కార్యాచరణ బృందంపై తనకు ఉన్న అనుమానాలను బయటపెట్టారు. పార్టీ అనుకున్న మార్పులను అమలు చేయాల్సిన బాధ్యత ఆ టీమ్ దే అని స్పష్టంగా చెప్పారు. తనను కూడా అదే టీమ్ లో ఉండాలని కోరారని.. కానీ తాను వద్దనుకున్నానని చెప్పారు. తాను ప్రియాంకాగాంధీకి పగ్గాలు అప్పగించాలని ఎవరికీ చెప్పలేదని.. అసలు ఎవరి పేర్లూ సూచించలేదన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీపై తన మనసులో మాటలను పీకే బయటపెట్టినట్టయ్యింది.