Prashant Kishor: నో పార్టీ.. `బీహార్`పై కేసీఆర్ బాణాలు!

కొత్త రాజ‌కీయ పార్టీపై ప్ర‌ముఖ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

  • Written By:
  • Updated On - May 5, 2022 / 02:12 PM IST

కొత్త రాజ‌కీయ పార్టీపై ప్ర‌ముఖ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎలాంటి పార్టీ పెట్టడం లేదంటూ పీకే గురువారం ప్రకటించారు. ఆ దిశగా తన మార్గాన్ని నిర్మించుకుంటున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 2 నుంచి 3,000 కిలోమీటర్ల మేర పాదయాత్రను బీహార్లో చేపడతానని పీకే ప్రకటించారు. పాదయాత్ర ద్వారా ప్ర‌జ‌ల్ని చేరుకుంటానని వెల్ల‌డించారు. బీహార్ కేంద్రంగా కొత్త పార్టీని ప్ర‌క‌టిస్తార‌ని ప‌లువురు ఊహించుకున్నారు. కానీ, ఆయ‌న త‌న‌దైన శైలిలో పాద‌యాత్ర‌కు దిగుతున్నారు. ఇటీవ‌ల కాలంగా కాంగ్రెస్ పార్టీలో చేర‌డానికి ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు అనేకం. ఆ పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ సానుకూలంగా రాక‌పోవ‌డంతో రాత్రిరాత్రి యూ ట‌ర్న్ తీసుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ పంచ‌న చేరారు. రెండు రోజుల పాటు ఆయ‌న నిర్విరామంగా చ‌ర్చ‌లు జ‌రిపారు. ఆ త‌రువాత కొత్త పార్టీ అంటూ లీకులు ఇచ్చారు. వాటిని నిజ‌మ‌నుకున్న మీడియా దేశ వ్యాప్తంగా ఫోక‌స్ చేసింది. ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ తెర వెనుకుండి పీకేతో కొత్త పార్టీ పెట్టిస్తున్నార‌ని అనుమానించారు.

ఆయ‌న టార్గెట్ అంతా బీహార్ రాష్ట్రం మీదే ఉంది. ఆ రాష్ట్ర సీఎం ప‌ద‌వి కోసం ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. అక్క‌డి సంప్ర‌దాయ పార్టీలు ప్ర‌స్తుతం బ‌ల‌హీనంగ ఉన్నాయ‌ని పీకే అంచ‌నా. అందుకే ఆర్జేడీ, జేడీయూ కు ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌ని ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలోనే కాంగ్రెస్ పార్టీతో జ‌ట్టుక‌ట్టాల‌ని మాస్ట‌ర్ ప్లాన్ చేశారు. ప్ర‌స్తుతం సీఎం నితీష్ కుమార్ అక్క‌డ సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నారు. ఆయన ప్ర‌భుత్వం పూర్తి కాలం ఉండే అవ‌కాశం లేద‌ని పీకే అంచ‌నా. ఒక వేళ మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు వ‌స్తే కాంగ్రెస్ రూపంలో అధికారంలోకి రావాల‌ని మాస్ట‌ర్ స్కెచ్ వేశార‌ని తెలుస్తోంది. కానీ, కాంగ్రెస్ తో ఆయ‌న వ్యూహం బెడిసి కొట్టొంది. కొత్త పార్టీ అంటూ మీడియా ద్వారా ఊద‌ర‌కొట్టించుకున్నారు. సీన్ క‌ట్ చేస్తే, కొత్త పార్టీ ఆలోచ‌న ప్ర‌స్తుతానికి లేదంటూ ముక్తాయించారు. ‘‘నేను జీరో నుంచి ప్రయాణం మొదలు పెట్టాలి. స్వరాజ్యం అనే ఆలోచనతో రానున్న మూడు నాలుగేళ్లలో సాధ్యమైనంత మంది ప్రజలను కలుసుకోవాలి’’ అంటూ తన భవిష్యత్ ప్రణాళికను పీకే వెల్ల‌డించారు. గత 15 ఏళ్లలో బీహార్ కు ఒరిగిందేమీ లేద‌ని ఆర్జీడీ, జేడీయూల‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో తనకు ఎటువంటి వ్యక్తిగత ఘర్షణ లేదంటూనే, వ్యక్తిగత సంబంధాలు వేరని, కలసి పనిచేయడం, అంగీకరించడం వేర్వేరు అని ప్రకటించారు. రాబోవు రోజుల్లో బీహార్ రాజ‌కీయాన్ని మార్చేయ‌డానికి పీకే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో ఎంఐఎంతో క‌లిసి ఆక్క‌డ ప‌నిచేసే అవ‌కాశం లేక‌పోలేదు.

ప్ర‌స్తుతం స‌హ‌జ మిత్రులుగా ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు కొన‌సాగుతున్నాయి. ఆ రెండు పార్టీల మ‌ధ్య ఎలాంటి పొర‌పొచ్చాలు లేవు. ఏడేళ్లుగా `పీకే`తో స‌న్నిహిత సంబంధాలు కేసీఆర్ కు ఉన్నాయి. ఆయ‌న జాతీయ రాజ‌కీయాల‌పై ఫోక‌స్ పెట్టారు. అందుకు కోసం ప్రత్యేక ఎజెండాను ఇటీవ‌ల వినిపించారు. బీహార్ రాష్ట్రం నుంచి. ఆయ‌న ఎజెండాను అమ‌లు చేయ‌డానికి సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. కేసీఆర్ వ‌దిలిన బాణంలాగా `పీకే` బీహార్ లో ప‌నిచేయ‌బోతున్నార‌ని వినికిడి. ఇప్ప‌టికే ఎంఐఎం బీహార్ అసెంబ్లీలో చోటు సంపాదించింది. రాబోవు ఎన్నిక‌ల్లో పీకే పాద‌యాత్ర ముగిసిన త‌రువాత కొత్త పార్టీ ప్ర‌క‌టించే అవ‌కాశం లేక‌పోలేదు. వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి ఎంఐఎంతో జ‌త కట్టి ప‌రోక్షంగా కేసీఆర్ మ‌ద్ధ‌తుతో రంగంలోకి దిగే మాస్ట‌ర్ స్కెచ్ హైద‌రాబాద్ కేంద్రంగా త‌యారు అయింద‌ని టాక్‌. మొత్తం మీద కేసీఆర్ బాణాలు బీహార్ రాష్ట్రం వ‌ర‌కు వెళ్లాయ‌న్న‌మాట‌.