Site icon HashtagU Telugu

PK: సోనియాతో పీకే భేటీ.. 2024 ఎన్నికల బ్లూ ప్రింట్ పై చర్చ !

Prashant

Prashant Kishor

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించనున్నారా ? 2024 సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీకి జవజీవాలు పోసేందుకు పదునైన వ్యూహాలు సిద్ధం చేయనున్నారా ? అంటే .. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆ దిశగానే సంకేతాలు పంపుతున్నాయి. తాజాగా శనివారం ఉదయం ప్ర‌శాంత్ కిశోర్ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్‌ గాంధీ, ఖ‌ర్గే, కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.
ఆయన కాంగ్రెస్‌ గూటికి చేరుతారనే అంచనాల నేప‌థ్యంలో ఈ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా .. రాజకీయ వ్యూహాలపై చర్చించేందుకే ఈసమావేశం పరిమితమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పీకే సన్నిహత వర్గాలు మాత్రం.. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బ్లూ ప్రింట్ ను తయారు చేసే అంశంపైనే చర్చ జరిగిందని అంటున్నాయి. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే.. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌లు, గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చార‌ బాధ్య‌త‌లు కూడా పీకే చేతిలో కాంగ్రెస్ పెట్టే అవకాశం ఉంటుందని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. పీకే శిష్యుడు సునీల్ క‌నుగోలుకు కూడా ఇదే త‌ర‌హా బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌బోతున్నార‌న్న ప్ర‌చార‌మూ ఉంది. కాగా, మే నెల రెండో తేదీకల్లా ప్ర‌శాంత్ కిశోర్ భవిష్యత్ కార్యాచరణ పై స్పష్టత వస్తుందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

గుజ‌రాత్ కాంగ్రెస్ నేత‌లు ఏమంటున్నారంటే..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్ర‌చార బాధ్య‌త‌లు ప్ర‌శాంత్ కిశోర్‌కు అధిష్ఠానం అప్ప‌గించనుందన్న వార్త‌ల‌పై గుజ‌రాత్ కాంగ్రెస్ నేత‌లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. పీకే రావ‌డం వ‌ల్ల కాంగ్రెస్‌కు ఒరిగేదేమీ ఉండదని, స్థానికంగా ఇప్ప‌టికే కాంగ్రెస్‌కు మంచి ప‌ట్టుంద‌ని అంటున్నారు. ఇలాంటి స‌మయాల్లో కోట్ల కొల‌ది డ‌బ్బును కుమ్మ‌రించి పీకేను తీసుకురావ‌డం నిర‌ర్ధ‌క‌మ‌ని గుజరాత్ కాంగ్రెస్ లోని ఒక వర్గం తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తోంది. ఇక మ‌రో గ్రూపు మాత్రం పీకే రావాల్సిందేన‌ని, ఆయన వస్తేనే అధికారం వ‌స్తుంద‌ని ప్ర‌చారం చేస్తోంది.