రానున్న వేసవిలో నిరాటంకమైన విద్యుత్ సరఫరా (Power supply) కోసం రాష్ట్రంలోని విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయిలో సన్నద్ధత చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Deputy cm bhatti vikramarka) ఆదేశించారు. జనవరి 27 నుండి ఫిబ్రవరి 4 వరకు వివిధ స్థాయిలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, వేసవి ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు.
Capital : అప్పటిలోగా అమరావతి నిర్మాణం పూర్తి : మంత్రి నారాయణ
శుక్రవారం ప్రజాభవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలు, అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో వివరణాత్మక సమీక్షలు చేపట్టాలని సూచించారు. గత వేసవిలో ఎదురైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని, ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. నోడల్ అధికారులు జనవరి 27న క్షేత్రస్థాయి పర్యటన షెడ్యూల్‌ను రూపొందించి, విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. జనవరి 29న ట్రాన్స్కో ఉన్నతాధికారులతో కలసి జిల్లా, సబ్ డివిజన్ స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఫిబ్రవరి 4న డివిజన్ స్థాయిలో ఎస్సీలు పూర్తి సిబ్బందితో సమీక్షలు నిర్వహించాలన్నారు.
ఈ సమావేశాల్లో రైతులు, వినియోగదారులు, మీడియా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారం, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తీసుకుంటున్న చర్యలపై వివరించాలని అధికారులను కోరారు. గత మూడు సంవత్సరాలుగా ఎదురవుతున్న ఓవర్‌లోడ్ ఫీడర్లు, డిటిఆర్ సమస్యలను చర్చించి, వీటి పరిష్కార మార్గాలను సూచించాలని ఆదేశించారు. ఈ సమీక్షల్లో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.