ఆకుకూరల్లో మెంతి ఆకు కూడా ఒకటి. మెంతి ఆకుకూరతో ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటారు. మెంతి వడలు, మెంతి పప్పు ఇలా ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు అయినా బంగాళదుంప కూర తిన్నారా. ఒకవేళ ఎప్పుడు తినక పోతే ఈ రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు :
మెంతి ఆకులు – రెండు కట్టలు
బంగాళదుంపలు – నాలుగు
పసుపు – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
పచ్చిమిర్చి – రెండు
నూనె – తగినంత
ఇంగువ – చిటికెడు
తయారీ విధానం :
ఆలుగడ్డలను ముందుగానే ఉడకబెట్టుకోవాలి. పొట్టు తీసి ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు మెంతి ఆకులు కూడా రెడీ చేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక బంగాళదుంప ముక్కలను వేసి వేయించాలి. అవి బంగారు రంగులోకి మారాక, పచ్చిమిర్చి, పసుపు కూడా వేసి వేయించాలి. ఇంగువ కూడా చల్లాలి. ఇప్పుడు ఇందులోనే మెంతి ఆకులను వేసి బాగా కలపాలి. తర్వాత ఉప్పు వేయాలి. పైన మూత పెట్టి ఐదు నిమిషాలు పాటు మగ్గించాలి. అవసరమైతే నీళ్లు వేసుకోవచ్చు. మెంతి ఆకులు పచ్చివాసన పోయేదాకా చిన్న మంట మీద ఉడికించాలి. అంతే ఆలు మేతి కూర రెడీ అయినట్టే.