Rahul Gandhi: కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ నిజామాబాద్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నర్సాపూర్ గేట్ వద్ద కాంగ్రెస్ విజయ భేరి సభలో పాల్గొని ప్రసంగించారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్‌లో పోస్టర్ల కలకలం రేగింది. రాహుల్ బోధన్ రాకను నిరసిస్తూ పోస్టర్లు వెలిశాయి. నిజామాబాద్, బోధన్‌లో గోడలకు పోస్టర్ల ప్రత్యక్షమయ్యాయి. తెలంగాణలో బలిదానాల బాధ్యత కాంగ్రెస్‌దేనని, మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీ అంటూ.. పోస్టర్లు అంటించారు.
వీటిపై రాహుల్, రేవంత్ రెడ్డి ఫోటోలు ముద్రించి ఉన్నాయి. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందేనని,ముక్కు నేలకు రాయాల్సిందేనని డిమాండ్ చేస్తూ పోస్టర్లు అంటించారు. ‘కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి కరెంటులేక అల్లాడుతున్న కర్నాటక. దివాళా తీస్తున్న పరిశ్రమలు.. కాంగ్రెస్ పేరెత్తితేనే జనం తిట్లు. కాంగ్రెస్ మనకు అవసరామా?. కర్నాటకలో ఉద్యోగాలు కాదు ఉరితాళ్లే అనే రాతలు పోస్టర్స్ లో కనిపించాయి. కాగా రాహుల్ ప్రసంగిస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు. ఈ పదేళ్లలో కేసీఆర్ సర్కార్ ప్రజలకు చేసేందేమీ లేదని అన్నారు.