China: చైనాలో జనాభా తగ్గుదల, పెళ్లి కాకపోయినా పిల్లల్ని కనొచ్చు!

  • Written By:
  • Publish Date - January 30, 2023 / 08:34 PM IST

China: ప్రపంచంలో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగి, ప్రపంచాన్నే శాసించాలనే చైనా ఆశయాన్ని అక్కడి పరిస్థితులు కలవరపరుస్తున్నాయి. చైనాలో ఇటీవల జనాభా భారీ స్థాయిలో క్షీణించింది. దీనితో చైనా తన విధానాలపై సమీక్షించాలని నిర్ణయించింది. జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న అక్కడి ప్రభుత్వ వర్గాలు దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. దాంతో ఆ దేశంలోని సిచువాన్‌ ప్రావిన్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

సిచువాన్ ప్రావిన్స్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం పెళ్లికాకపోయిన కూడా చట్టబద్ధంగా పిల్లల్ని కలిగి ఉండొచ్చు. వీరికి వివాహితులు పొందే ప్రయోజనాలు పొందడానికి ఆ ప్రావిన్స్‌ అనుమతించనున్నట్లు ఒక అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. గతంలో ఉన్న రూల్స్ ప్రకారం పెళ్లి అయిన వారు మాత్రమే చట్టబద్ధంగా పిల్లలకు జన్మనివ్వడానికి అనుమతి ఉంది. తాజా నిబంధనతో.. వివాహం కాని ఒంటరి వ్యక్తి పిల్లలు కావాలనుకుంటే పిల్లలని కనవచ్చు. అయితే ఈ రూల్ ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి రానున్నట్టు సమాచారం.

ఈ నిబంధన ప్రకారం పెళ్లి కాకుండా పిల్లల్ని కనాలనుకుంటే ముందుగా సిచువాన్‌ అధికారుల వద్ద రిజిస్టర్‌ చేసుకోవచ్చు. అంతేగాకుండా పిల్లల సంఖ్య విషయంలో కూడా ఎలాంటి పరిమితి విధించరని తెలుస్తోంది. దీర్ఘకాల సమతుల్యతతో కూడిన జనాభా అభివృద్ధిని ప్రోత్సహించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు సిచువాన్‌ ఆరోగ్య కమిషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకూ ఇద్దరు పిల్లలు కావాలనుకున్న వెళ్లిన జంట మాత్రమే కమిషన్‌ వద్ద రిజిస్టర్‌ చేసుకునేందుకు అనుమతి ఉంది. కానీ, ఇప్పుడు వారితో పాటు పెళ్లికాని వారికీ అనుమతి లభించనుంది.

అప్పట్లో జనాభా పెరుగుదలను నివారించడానికి చైనా చేపట్టిన చర్యల ఫలితంగా.. 6 దశాబ్దాల తర్వాత తొలిసారి చైనా జనాభా తగ్గింది. మరణాల కంటే జననాల రేటు తక్కువగా నమోదైంది. వృద్ధాప్య వయస్సు వారి సంఖ్య పెరగడం, జననాల రేటు తగ్గడం వంటి అంశాలు ఆ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాబట్టి ముందుగానే చలించి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిపుణులు తెలియజేస్తున్నారు. అప్పట్లో చైనాలో “ఒకరు ముద్దు అసలే వద్దు” నినాదాన్ని ఫాలో అయ్యేవారు, ప్రస్తుత నిబంధనలతో అది మరుగున పడనుంది.