Site icon HashtagU Telugu

Scam: ఎన్నారై అకాడమీ పై విచారణ

Crime

Crime

మంగళగిరికి సమీపంలోని చినకాకాని వద్ద ఉన్న ఎన్నారై అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో డైరెక్టర్లు పరస్పరం చేసుకున్న ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మంగళగిరి అదనపు సీనియర్‌ సివిల్‌జడ్జి కోర్టులో దీనికి సంబంధించి ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఎన్‌ఆర్‌ఐలో బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు రెండువర్గాలుగా ఏర్పడ్డారు. ఆసుపత్రి, కళాశాల నిర్వహణలో నిధులు దుర్వినియోగమయ్యాయంటూ గత ఏడాది జూన్‌లో మంగళగిరి గ్రామీణ పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. గుంటూరు అర్బన్‌ సిటీ క్రైమ్స్‌ స్టేషన్‌-2 విభాగం డీఎస్పీ మోజస్‌ పాల్‌ దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు.
సేవాదృక్పథంతో ఏర్పాటైన ఎన్నారై అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ 2008 వరకు బాగానే నడిచిందని, ఆ తర్వాత కొత్త డైరెక్టర్లను తీసుకోవడంతో అకాడమీలో విభేదాలు ఏర్పడ్డాయి. ఆసుపత్రి రికార్డులు, ఆడిట్‌ నివేదికలు, బిల్లుల చెల్లింపుల ఇన్వాయిస్‌లు వంటివి దర్యాప్తు అధికారులు సేకరించి ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. కరోనా సమయంలో రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేశారని, మేనేజ్‌మెంట్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీట్లకు అధిక మొత్తంలో అమ్ముకున్నారని, భవనాలు నిర్మించకుండా వాటి పేరుతో నిధులు మళ్లించుకున్నారని చేసుకున్న ఫిర్యాదులపై విచారించి ఛార్జీషీట్‌ దాఖలు చేశారు. అకాడమీలో ఒక వర్గానికి డాక్టర్‌ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌, మరోవర్గానికి డాక్టర్‌ ముక్కామల అప్పారావులు నేతృత్వం వహిస్తున్నారు. 30 మంది డైరెక్టర్ల విరాళాలతో తొలినాళ్లలో ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు అందులో పేర్కొన్నారు.