Police Chase: వారేవా! పోలీస్.. స్మగ్లర్ల వాహనాన్ని 22 కి.మి. ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు!

  • Written By:
  • Publish Date - April 10, 2022 / 03:10 PM IST

పోలీసులంటే కులాసాగా ఉంటారు. స్టేషన్ నుంచి కదలరు. శాంతిభద్రతల విషయాన్ని పెద్దగా పట్టించుకోరు అని చాలామంది అనుకుంటారు. కానీ కొందరు పోలీసులు మాత్రం ప్రాణాలకు తెగించయినా సరే డ్యూటీ చేస్తారు. ఏకంగా సినిమాల్లో ఉన్నట్టు ఛేజింగ్ సీన్లు కూడా వీరి డ్యూటీలో భాగమే. గురుగ్రామ్ లో ఆ పోలీసుల గురించి తెలిస్తే.. కచ్చితంగా మీరు కూడా వారికి మనస్ఫూర్తిగా సెల్యూట్ కొడతారు.

ఐదుగురు పశువుల స్మగ్లర్లు.. గోవులను అక్రమంగా తరలించడానికి ప్లాన్ చేశారు. అంతా పకడ్బందీగానే జరిగింది. కానీ ఈ సమాచారం పోలీసులకు తెలిసింది. అంతే వెంటనే ఆ గోవులను రక్షించాలన్న ధ్యేయంతో ఆ స్మగ్లర్ల వాహనాన్ని టార్గెట్ చేశారు. అయితే అప్పటికే వారి వాహనం ఢిల్లీ బోర్డర్ దాటింది. గురుగ్రామ్ లోకి చేరింది. దీంతో వాహనాల తనిఖీ అంటూ దానిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఆ లారీ డ్రైవర్ మాత్రం బండిని ఆపకుండా వేగంగా నడిపించాడు.

స్మగ్లర్ల వెర్రి వేషాలు పోలీసులకు ఆగ్రహం తెప్పించాయి. వెంటనే ఆ లారీని వెంబడించారు. అలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 22 కిలోమీటర్ల మేర అర్థరాత్రి వేళ ఛేజింగ్ చేశారు. అప్పటికే ఖాకీలను ముప్పుతిప్పలు పెట్టిన స్మగ్లర్లు చివరకు చేతులెత్తేశారు. కానీ ఈలోపు ఈ ఛేజింగ్ సీన్ లో పోలీసులు కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో లారీ టైర్ పేలిపోయినా ఆ బండిని మాత్రం ఆపకపోవడంతో పోలీసులు మరింత దూకుడుగా ముందుకు వెళ్లారు. మొత్తానికి 22 కిలోమీటర్ల ఛేజింగ్ తరువాత స్మగ్లర్లు దొరికారు.

స్మగ్లర్ల వాహనంలో తుపాకులు, బుల్లెట్లు కూడా ఉండడంతో పోలీసులు షాకయ్యారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. గురుగ్రామ్ లో ఇలా పశువులను అక్రమంగా తరలించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి దారుణాలు జరిగాయి. అక్కడికీ హర్యానా ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా సరే ఈ దురాగతాలు ఆగడం లేదు. దీంతో ఇలా ప్రాణాలకు తెగించి మరీ స్మగ్లర్ల వాహనాలను ఛేజ్ చేసి మరీ పట్టుకోవాల్సి వస్తోంది. కానీ ఈ ఛేజింగ్ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అయ్యింది.