Site icon HashtagU Telugu

PM Modi Calls: బీజేపీ కార్పొరేటర్లకు మోడీ పిలుపు!

Modi

Modi

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)కి చెందిన 47 మంది బిజెపి కార్పొరేటర్లతో పాటు హైదరాబాద్ యూనిట్ ఆఫీస్ బేరర్లు, ఇతర సీనియర్ నాయకులను మంగళవారం ఢిల్లీలో తనను కలవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. మోదీ ప్రధానిగా ఉన్న సమయంలో ఇలాంటి సమావేశాలకు పిలుపునివ్వడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా బిజెపి నాయకుడు, అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. “మా కార్పొరేటర్లు, ఆఫీస్ బేరర్లు మంగళవారం ప్రధానమంత్రిని కలవాలని కోరారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఐఎస్‌బీని సందర్శించిన సందర్భంగా ఆయన మా అందరినీ ఆహ్వానించారు. వర్షాల కారణంగా కలవడం సాధ్యంకాలేదు. ప్రధాని మరోసారి మమ్మల్ని ఆహ్వానించారు‘‘ అని అన్నారు.

“రేపు ఉదయం 10 గంటలకు అందరం ఢిల్లీ చేరుకుంటాం. ప్రధాని మోదీ టీ మీటింగ్‌ను ప్రారంభించనున్నారు. ఇది మర్యాదపూర్వక సందర్శన మాత్రమే. పార్టీ కోసం పనిచేసేలా ప్రధాని మోదీ మమ్మల్ని ప్రేరేపిస్తారు. ఆ స్ఫూర్తిని కొనసాగించి ప్రధానిని కలుస్తాం’’ అని చెప్పారు. ముషీరాబాద్‌ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌ సుప్రియాగౌడ్‌ మాట్లాడుతూ ‘‘ప్రధాని నరేంద్ర మోదీ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌లతో పాటు హైదరాబాద్‌ యూనిట్‌ ఆఫీస్‌ బేరర్లు, ఇతర సీనియర్‌ నేతలను ఢిల్లీలో కలవాలని ఆహ్వానించడం సంతోషంగా ఉంది. మేం మా కార్పొరేషన్‌లో ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవిస్తాం’’ ఆమె అన్నారు.

వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆసక్తిగా మారింది. 2020లో జరిగిన హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా, ఏఐఎంఐఎం 44 సీట్లు గెలుచుకుంది. టీఆర్‌ఎస్ 56 సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ బీజేపీ కార్పొరేట్లను ఢిల్లీకి పిలుపించుకోవడం రాజకీయ ఎజెండాగా భావిస్తున్నారు ఇతర పార్టీల నేతలు. బీజేపీ నాయకులకు, కార్పొరేటర్లకు మోడీ ఏయే విషయాలపై దిశానిర్దేశం చేస్తారనేది? ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వచ్చే నెలలో మోడీ రోడ్ షో కూడా ఖరారు కావడంతో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయని చెప్పక తప్పదు.