Modi In J&K:ఆర్టికల్ 370 రద్దు తో కశ్మీరీలకు సాధికారత

గతంలో తమ పూర్వీకులు ఎదుర్కొన్న సమస్యలు, కష్టాలను ఎదుర్కోవడానికి కశ్మీర్ యువత సిద్ధంగా లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

  • Written By:
  • Publish Date - April 24, 2022 / 04:12 PM IST

– రిజర్వేషన్ ప్రయోజనాలనూ అందుకునేలా సశక్తం
– దేశంలో ఉన్న చట్టాలే.. ఇప్పుడు కశ్మీర్ లోనూ అమలవుతున్నాయి
– కశ్మీరీ యువత మార్పును కోరుకుంటున్నారు
– కశ్మీర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగం
– రూ.20వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం

గతంలో తమ పూర్వీకులు ఎదుర్కొన్న సమస్యలు, కష్టాలను ఎదుర్కోవడానికి కశ్మీర్ యువత సిద్ధంగా లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వారు మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ మార్పుకు కశ్మీర్ లోని ప్రజాప్రతినిధులు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ఆర్టికల్ 370 రద్దు వల్ల .. కశ్మీర్ లో ఏళ్ల తరబడి రిజర్వేషన్ ప్రయోజనం పొందనివారు.. ఇప్పుడు రిజర్వేషన్ ప్రయోజనం పొందే వీలు కలిగిందన్నారు. దేశంలో ఉన్న చట్టాలే ఇప్పుడు కశ్మీర్ లో అమలు అవుతున్నాయని.. దీనివల్ల ఇక్కడి ప్రజలకు సాధికారత లభించిందని చెప్పారు. ఆదివారం కశ్మీర్ లో రూ.20,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా జమ్మూ డివిజన్ లోని సాంబా జిల్లా పల్లీ గ్రామపంచాయతీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న గ్రామసభలను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు.

మోడీ ప్రసంగం ఇదీ..

” నేను అభివృద్ధి సందేశాన్ని ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. జమ్మూ కశ్మీర్ అభివృద్ధిని వేగవంతం చేసే ఏకైక సంకల్పంతో రూ.20,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించాను. చాలా ఏళ్లుగా మూడు అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ కు నోచుకోక .. జమూకశ్మీర్ ప్రజలు అవస్థలు పడ్డారు. ఇప్పుడు కశ్మీర్ లో ప్రజాస్వామ్యం .. పునాది లాంటి గ్రామ స్థాయికి చేరింది. ఇదే అభివృద్ధికి తొలి సంకేతం. గ్రామ పంచాయతీ, పార్లమెంటు.. ఈరెండింటిలో ఏది కూడా తక్కువ కాదు. దేని బాధ్యతలు దానికి ఎంతో ముఖ్యమైనవి. సాంబా జిల్లా పల్లీ గ్రామపంచాయతీ దేశంలోనే తొలి కార్బన్ న్యూట్రల్ పంచాయతీగా అవతరిస్తుండటం స్ఫూర్తిదాయకం. కశ్మీర్ గ్రామ పంచాయతీల వికాసానికి అండగా ఉంటాం’ అని ప్రధాని మోడీ ప్రసంగించారు.

ప్రారంభించిన రూ.20,000 కోట్ల అభివృద్ధి పనులివీ..

– కిష్ట్వార్ జిల్లాలో చీనాబ్ నదిపై 850 మెగావాట్ల ర్యటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, 540 మెగావాట్ల క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.
– రూ.3,100 కోట్ల వ్యయంతో నిర్మించిన బనిహాల్ – క్వాజి గుండ్ రోడ్ టన్నెల్ ను మోడీ ప్రారంభించారు.
– ఢిల్లీ- అమృత్ సర్ – కాత్రా ఎక్స్ ప్రెస్ వే నిర్మాణానికి మోడీ పునాది రాయి వేశారు.
– సాంబా జిల్లా పల్లీ గ్రామ పంచాయతీలో 500 కిలో వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ను మోడీ ప్రారంభించారు.