Site icon HashtagU Telugu

PM Modi : స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా భారీ ఉపాధి పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

PM Modi launches massive employment scheme on Independence Day

PM Modi launches massive employment scheme on Independence Day

PM Modi : 2025 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, దేశ యువతకు ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద శుభవార్త అందించారు. ఎర్రకోట వేదికగా జరిగిన జాతీయ కార్యక్రమంలో, లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించిన ‘వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ను ప్రధాని ఘనంగా ప్రారంభించారు. ఈ పథకం దేశంలో ఉద్యోగ అవకాశాలు పెంపొందించడమే కాకుండా, తొలి ఉద్యోగంలో అడుగుపెట్టే యువతకు ప్రత్యక్ష ఆర్థిక మద్దతు అందించనుంది. ప్రైవేటు రంగంలో తొలిసారి ఉద్యోగం పొందిన వారికి ప్రభుత్వం ఏకంగా రూ.15,000 ప్రోత్సాహకంగా చెల్లించనున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు.

ఇది నా యువతకు బహుమతి

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..నా దేశ యువత కోసం ఎంతో కీలకమైన పథకాన్ని ప్రారంభిస్తున్నాను. ఇది వారి భవిష్యత్‌కు బలమైన పునాది. ఈ రోజే, అంటే ఆగస్టు 15 నుంచే ఈ పథకం అమల్లోకి వస్తోంది.అని ప్రకటించారు. యువతకు తొలి ఉద్యోగం పొందడంలో ఈ ఆర్థిక సహాయం ఎంతో తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రైవేటు రంగానికి ప్రోత్సాహకాలు

ఈ పథకం ప్రయోజనాలు కేవలం ఉద్యోగార్థులకే పరిమితం కాకుండా, కొత్త ఉద్యోగాలను సృష్టించే ప్రైవేటు సంస్థలకూ వర్తిస్తాయి. ప్రతీ కొత్త ఉద్యోగాన్ని సృష్టించిన ప్రతి సంస్థకు నెలకు రూ.3,000 వరకు నేరుగా ఆర్థిక సహాయం అందించనుంది. ముఖ్యంగా తయారీ రంగ సంస్థలు ఈ పథకం ద్వారా మరింత ప్రయోజనం పొందనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

3.5 కోట్ల ఉద్యోగాల లక్ష్యం

రాబోయే రెండేళ్ల కాలంలో ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 3.5 కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఇందులో సుమారుగా 1.92 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగుపెట్టే అవకాశముందని అంచనా. దేశ ఆర్థిక వ్యవస్థలో తాజా ఉత్సాహం నింపే విధంగా ఈ పథకం ఉండనుంది. ఈ పథకాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ మరియు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సంయుక్తంగా అమలు చేయనున్నాయి. పథకం అమలు పరవళ్లు మొదలయ్యేలా అధికారులు అవసరమైన చర్యలు ఇప్పటికే ప్రారంభించారు.

వికసిత భారత్ లక్ష్యంలో కీలక మైలురాయి

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే ‘వికసిత్ భారత్’ లక్ష్యంలో ఈ రోజ్‌గార్ యోజన కీలక మైలురాయి అవుతుంది అని ప్రధాని మోదీ స్పష్టంగా పేర్కొన్నారు. ఇది నా యువతకు డబుల్ దీపావళి లాంటి సంబరం. వారిని ఆర్థికంగా, సాంకేతికంగా ఎదిగించే గొప్ప అవకాశం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిష్ఠాత్మక పథకం దేశ యువతకు ఉద్యోగ భద్రతను కల్పించడమే కాకుండా, దేశ ఆర్థిక వృద్ధికి బలమైన మార్గదర్శకంగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Read Also: Trump Tariffs : అమెరికా బెదిరింపులు.. వెనక్కి తగ్గని భారత్