PM Modi: నేడు హైదరాబాద్ కు ‘మోదీ’… పీఎం వెంటే తెలంగాణ సీఎం…!

ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఏయిర్ పోర్ట్ కు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు

  • Written By:
  • Updated On - February 8, 2022 / 12:12 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఏయిర్ పోర్ట్ కు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ లో పటాన్ చెరులోని ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లోనే ముచ్చింతల్ చేరుకుంటారు. అనంతరం అతిధి గృహంలో 10 నిమిషాల పాటు రెస్ట్ తీసుకుంటారు. 6 గంటలకు యాగశాలకు చేరుకుని, పెరుమాళ్లను దర్శించుకుని విశ్వక్ సేనుడికి పూజ చేయనున్నారు మోదీ. సాయంత్రం 7 గంటలకు సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని జాతికి అంకితం చేస్తారు. సమతామూర్తి విగ్రహం వద్ద దాదాపు అరగంట పాటు పీఎం ప్రసంగించనున్నారు.

మోదీ సమక్షంలోనే రామానుజచార్యుల విగ్రహంపై 15 నిమిషాల పాటు 3డీ లైటింగ్ ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత మరోసారి యాగశాలకు చేరుకుని శ్రీలక్ష్మీనారాయణ యాగానికి పూర్ణాహుతి పలకనున్నారు. 5 వేల మంది రుత్వికులు ప్రధాని మోదీకి వేద ఆశీర్వచనం ఇవ్వనున్నారు. ముచ్చింతల్ లో కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు ప్రైమ్ మినిస్టర్. ఇక తెలంగాణ సీఎం ఇవాళ అంతా కూడా పీఎం తోనే ఉండనున్నారు. మోదీ కి విమానాశ్రయంలో స్వాగతం పలకడం దగ్గరనుంచి మొదలుకుని, ఆయన తిరిగి వెళ్లేవరకు సీఎం కేసీఆర్ ప్రధాని వెంటే ఉండనున్నారు.

అలాగే మోదీ పాల్గొనే అన్ని కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ కూడా పాల్గొననున్నారు. మోదీ హైదరాబాద్ రాక నేపధ్యంలో పోలీసు యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టింది. 8 వేల మంది పోలీసులతో భద్రత కల్పించనుంది. ఎస్పీజీ తో తెలంగాణ పోలీసులు సమన్వయం చేసుకోనున్నారు.