Baby AB De Villiers: వస్తున్నాడు బేబీ ఏబీడీ

అండర్ 19 ప్రపంచకప్‌ ఆ కుర్రాడిని కోటీశ్వరుడిని చేసింది. ఒక్క టోర్నీతో ప్రపంచ క్రికెట్‌లోనే రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్‌లో అవకాశం దక్కింది.

  • Written By:
  • Publish Date - February 13, 2022 / 01:25 PM IST

అండర్ 19 ప్రపంచకప్‌ ఆ కుర్రాడిని కోటీశ్వరుడిని చేసింది. ఒక్క టోర్నీతో ప్రపంచ క్రికెట్‌లోనే రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్‌లో అవకాశం దక్కింది. ఆ కుర్రాడే సౌతాఫ్రికాకు చెందిన డివాల్ట్ బ్రివీస్.. బేబీ ఏబీ డివీలియర్స్‌గా పేరున్న బ్రివీస్‌కు ఐపీఎల్ వేలంలో మంచి ధర పలుకుతుందని ముందే ఊహించారు. అండర్ 19 క్రికెటర్లు తక్కువ ధరకే సొంతమవడం… భవిష్యత్తులో జట్టు ప్రయోజనాలకు సిద్ధం చేసుకునే వెసులుబాటు ఉండడంతో వారిని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తాయి. సాధారణంగా దేశవాళీ యువక్రికెటర్లను తీసుకునే విషయంలో భారత ఆటగాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ సారి దక్షిణాఫ్రికా యువ ఆటగాడి కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అచ్చం ఏబీ డీవిలియర్స్ తరహాలో బ్యాటింగ్ చేస్తుండడం ఈ కుర్రాడి ప్రత్యేకత. అన్నింటికీ మించి ఇటీవల అండర్ 19 ప్రపంచకప్‌లో బ్రివీస్ దుమ్మురేపాడు. టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ రాణించిన బేబీ ఏబీడీ 506 పరుగులు చేశాడు. తద్వారా 18 ఏళ్ళ నాటి శిఖర్ ధావన్ రికార్డును కూడా అధిగమించాడు.

గతంలో ధావన్ 505 పరుగులు చేయగా… బ్రివీస్ దానిని బ్రేక్ చేశాడు. ఇటీవల జరిగిన అండర్ 19 వరల్డ్‌కప్‌లో భారత్‌ 65 పరుగులు చేసిన బ్రివీస్ ఉగాండాపై 104 , ఐర్లాండ్‌పై 96 పరుగులు చేశాడు. అలాగే ఇంగ్లాండ్‌పై 97, శ్రీలంకపై 6, బంగ్లాదేశ్‌పై 138 పరుగులు చేయడంతో ఈ యువ క్రికెటర్ కోసం ముంబై, చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంచైజీలో ఆసక్తి చూపించాయి. 20 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలో నిలిచిన బ్రివీస్ కోసం ఈ రెండు ఫ్రాంచైజీలు పోటీపడగా.. చివరికి ముంబై ఇండియన్స్ 3 కోట్లకు దక్కించుకుంది. మిస్టర్ 360 తరహాలో అన్ని వైపులా షాట్లు కొట్టడం బ్రివీస్‌ను ప్రత్యేకంగా నిలిపింది. ఈ కారణంగానే అందరినీ మరింతగా ఆకర్షించాడు ఈ సఫారీ యువక్రికెటర్. అయితే ఐపీఎల్‌లో ఆర్సీబీ జట్టు అంటే తనకు చాలా ఇష్టమమని, ఆ జట్టులో ఆడాలనుకుంటున్నానంటూ మనసులో కోరిక చెప్పాడు. వేలంలో మాత్రం ముంబై ఇండియన్స్ అతన్ని సొంతం చేసుకుంది. బౌలింగ్‌లోనూ బ్రివీస్ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకూ 9 మ్యాచ్‌లలో 17 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆల్‌రౌండర్‌గా మరింత పట్టు సాధించేందుకు ఐపీఎల్ ఖచ్చితంగా ఈ యువ ఆటగాడికి ఉపయోగపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.