బీజేపీ జాతీయ నాయకులు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్ పై ఘాటుగా స్పందించారు. ’’వేములవాడ, యాదాద్రి దేవస్థానం అభివృద్ధి నిధులను కామారెడ్డి నియోజకవర్గ దేవాలయాలకు మళ్లించారు. ప్రజలు తిరగబడి ప్రశ్నించడంతో తన సహజ శైలిలో రాత్రి జీవో జారీ చేసిన కేసిఆర్ తీరును రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. కేసీఆర్ వేసిన ఈ వెనకడుగు ఖచ్చితంగా ప్రజా విజయమే’’ బండి అన్నారు.
‘‘తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్న తీరుని యావత్ హిందూ సమాజం పసిగట్టింది. గతంలో ఆర్భాటంగా హామీలు గుప్పించిన వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధి ఏ స్థాయిలో ముందుకు సాగిందో ప్రజలు గమనిస్తున్నారు. ఓవైపు ప్రజలనీ వంచిస్తూ, మరోవైపు దేవుళ్ళని కూడా వంచిస్తున్న కేసీఆర్ కి ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్పడం ఖాయం’’ బండి సంజయ్ హెచ్చరించారు.