Site icon HashtagU Telugu

Shanghai Crisis: అన్నం కోసం అరెస్టు అయ్యేందుకు క్యూ!!

shanghai

shanghai

చైనా లో ఓ వైపు కరోనా భయాలు .. మరోవైపు ఆకలి కేకలు విలయతాండవం చేస్తున్నాయి. మూడు వారాలుగా లాక్ డౌన్ లో మగ్గుతున్న వాణిజ్య రాజధాని శాంఘై లో పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే.. స్థానికులు ఆకలి మంటలు తీర్చుకోవడానికి అరెస్టు అయ్యేందుకు సిద్ధమయ్యే దాకా!! కఠిన లాక్ డౌన్ లో అన్నం దొరకకుండా ఇంటికే పరిమితమయ్యే కంటే.. బుక్కెడు బువ్వ దొరికే జైలు పాలు కావడం మంచిదని ఎంతోమంది శాంఘై నగరవాసులు భావిస్తున్నారు. ఎలాగైనా పోలీసుల దృష్టిలో పడి అరెస్టు అయ్యేందుకు.. ఇప్పటికే ఎంతోమంది కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారు. శాంఘై నగరం పరిధిలో నిత్యావసరాల పంపిణీ వ్యవస్థలో పనిచేసే వేలాది కార్మికులను నగరపాలక సంస్థ బలవంతంగా క్వారంటైన్ కు పంపింది. దీంతో నిత్యావసరాల పంపిణీ మూడు వారాలుగా నత్తనడకన సాగుతోంది.

కనీసం ప్రజలకు మందుల షాపుల్లో ఔషధాలు కూడా అందుబాటులో లేవు. ఈనేపథ్యంలో వాటి ధరలు కొండెక్కాయి. అయినా ధరల నియంత్రణకు చైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో షాంఘై నగరపాలక సంస్థ ఇస్తున్న నిత్యావసరాల డెలివరీ స్లాట్ల కోసం నగరవాసులు పడుతున్న తంటాలు అన్నీఇన్నీ కావు. ఆకలి కేకలు తాళలేక .. లాక్ డౌన్ ను ఉల్లంఘించి ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేక.. ఇంటి వసారాలోనే నిలబడి జానపద గేయాలు పాడుతూ ప్రజలు ఆవేదన వెళ్లగక్కుతున్న వీడియోలు చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “మమ్మలి ఆదుకోండి .. తినడానికి ఏం లేదు ” అంటూ ప్రజలు షాంఘై నగర రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తున్న మరో వీడియో కూడా వైరల్ అవుతోంది.

షాంఘై లోని పలు సూపర్ మార్కెట్ల లోకి నగరవాసులు చొరబడి నిత్యావసరాల లూటీకి పాల్పడిన ఓ వీడియో ఆకలి కేకలు ఎంతలా పెరిగాయో సూచిస్తోంది. ఇంకొంతమంది షాంఘై నగరవాసులు శాంతియుతంగా తమ నిరసన తెలుపుతున్నారు. ఖాళీగా ఉన్న ఫ్రిజ్ లను తమ ఇళ్ల బాల్కనీలో తెరిచి ఉంచి.. నిత్యావసరాలు నిండుకున్నాయి అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. ఇక కోవిడ్ తో క్వారంటైన్ లోకి వెళ్లిన వారి ఇళ్లలోని పెంపుడు కుక్కలను నగర పాలక సంస్థ అధికారులు చంపేస్తున్నారు. మనుషులకే సరిపడా ఆహార సరఫరా లేనప్పుడు.. ఇక కుక్కలకు తిండి ఎలా పెట్టగలం అనే ఉదేశంతో ఇలా చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది కొన్ని కుక్కలను కర్రలతో చావబాదుతున్న వీడియోలు అందరి మదిని కలచి వేసేలా ఉన్నాయి.