Minister Roja: జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు ‘సిద్ధం’ : మంత్రి రోజా

  • Written By:
  • Publish Date - March 13, 2024 / 04:45 PM IST

Minister Roja: జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక యువజనసర్వీసుల క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు. బుధవారం మండల కేంద్రం వడమాలపేటలో ఏర్పాటుచేసిన సిద్ధం సభలో ఆమె పాల్గొన్నారు. ఎస్‌బిఆర్‌ పురం పంచాయతీలోని చెంచు వారి కాలనీలో 55 మందికి, ఏబిఆర్‌ కాలనీలో 107 మందికి ఇండ్లపట్టాలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల యుద్దం ప్రారంభం కానుందని జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

ప్రజాసంకల్పయత్రలో సమస్యలు కనుగొని దానికగుణంగా నవరత్నాలను రచించి. ప్రతి రంగానికి, ప్రతి సామాజికవర్గానికి మేలు జరిగేలా సంక్షేమాన్ని అమలుచేసి, సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థ ద్వారా పాలనను చేరువచేసి, కుల, మత, పార్టీలకు అతీతంగా సుపరిపాలన అందిస్తూ, చిత్తశుద్దితో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఎన్నికలకు మరో 45 రోజులు ఉందని ఈ సమయం ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని ప్రజలకు వివరించడానికి, తెలుగుదేశం జనసేన చెప్పే అబద్ధాలు బట్టబయలు చేయడానికి ప్రతి కార్యకర్త ఉపయోగించాలన్నారు. చంద్రబాబుకు సంక్షేమాభివృద్ది పట్టదని ఆ ఆలోచన ఉంటే పద్నాలుగేళ్ల పాలనలో ఆయన ఎందుకు ఇన్ని మంచిపనులు చేయలేకపోయారన్నారు.

ప్రతి ఇంటికీ సంక్షేమం ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్న ఆయన నేడు ఊహకందని హామీలను ఇచ్చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది జగనన్న వాస్తవంలో చూపిన సంక్షేమాభివృద్ధికి, టీడీపీ, జనసేనల అభూత కల్పనకు మద్య జరిగే యుద్దమన్నారు. సంక్షేమాన్ని అందుకున్న ప్రజలకు దానికి అడ్డుపడే పెత్తందార్లకు మద్య యుద్దమన్నారు. ఎన్నికల పోరులో ప్రజల ఆశీస్సులే జగనన్న ఆయుధం అన్నారు. జరిగిన మంచిని గుర్తు పెట్టుకొని అటు జగనన్నకు, తనకు ఫ్యాన్‌ గుర్తు బటన్‌పై నొక్కి ప్రజావిజయానికి నాంధిపలకాలన్నారు. ప్రజాశీస్సులతో 175 స్థానాల్లోను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఖాయమని, మంచిపై చెడు గెలిచినట్లు ఏ చరిత్రలోను లేదన్నారు. ఈ కార్యక్రమంలో వడమాలపేట మండల్‌ ప్రజా ప్రతినిధులు, రెవిన్యూ అధికారులు వైఎస్‌ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.