Site icon HashtagU Telugu

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ‘పవన్ కౌలు రైతు భరోసా యాత్ర’ విజయవంతం..!

pawan kalyan

pawan kalyan

అప్పుల బాధలు తాళలేక కౌలు రైతుల జీవితాలు అర్ధంతరంగా రాలిపోతుంటే.. ఆ కుటుంబాలు పలుకరించే దిక్కులేక, పట్టించుకునే నాధుడు లేక ఇబ్బందులు పడుతున్న వేళ మీ కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. మొన్న అనంతపురం జిల్లాలో 30 మంది కౌలు రైతు కుటుంబాలకు ఆర్ధిక సాయం చేసిన ఆయన., ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డున పడిన అన్నదాతల కుటుంబాలకు ధైర్యం నింపారు. శనివారం జిల్లాలో నిర్వహించిన జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల ఇళ్లకు వెళ్లి ఆ కుటుంబాల కష్టాలు ఆలకించారు. కౌలు రైతుల కన్నీరు తుడిచేందుకు జనసేన పార్టీ ఉందన్న ధైర్యాన్ని నింపారు.

ఇంటింటికీ వెళ్లి కష్టాల్లో ఉన్న ఆ కుటుంబాలను పలుకరిస్తూ.. ఆత్మహత్యలకు గల కారణాలను ఓపికగా ఆలకించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం ఎందుకు అందలేదో విచారించి, వారికి న్యాయబద్దంగా అందాల్సిన రూ. 7 లక్షల పరిహారం అందే ఏర్పాటు చేయాలని జిల్లా నాయకత్వానికి సూచించారు. మార్గమధ్యంలో జానంపేట నుంచి లింగపాలెం వరకు ఐదు కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందచేశారు. చింతలపూడిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మరో 35 మందికి రూ. లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందచేశారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు నియోజకవర్గం జానంపేట గ్రామానికి చెందిన కౌలు రైతు నెరుసు మల్లికార్జునరావు సాగు నష్టాలు, ఆర్ధిక ఇబ్బందుల నేపధ్యంలో ఆత్మహత్య చేసుకున్నారు. కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జానంపేటలోని మల్లికార్జునరావు కుటుంబాన్ని పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆయన భార్య శ్రీమతి శివదుర్గను అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబాన్ని ఓదార్చి రూ. లక్ష ఆర్ధిక సాయం అందచేశారు. ఆ కౌలు రైతు బిడ్డల భవిష్యత్తుకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం అందే వరకు వదిలిపెట్టమని హామీ ఇచ్చారు.

కౌలు రైతు బిడ్డ చదువు బాధ్యత తీసుకుంటాం:
చింతలపూడి నియోజకవర్గం, ధర్మాజీగూడెంలో మరో కౌలు రైతు దాసరి రాజారావు కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసి అప్పులపాలైన రాజారావు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు వయసు మళ్లిన తల్లిదండ్రులు, కుమారుడు ఉన్నారు. తండ్రి సుసి, తల్లి శ్రీమతి మరియమ్మలను ఓదార్చి ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్ధిక సాయాన్ని చెక్ రూపంలో అందించారు. చిన్నారి అఖిల్ చదువు బాధ్యతలను జనసేన పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

బిడ్డల భవిష్యత్తు బాధ్యత మాదే:
మఠంగూడెంకు చెందిన కౌలు రైతు శ్రీకాకొల్లు బాబురావు అప్పుల బాధలతో ఆత్మహత్య చేసుకున్నారు. అతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బాబురావు మరణం తరువాత తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకు జనసేన పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయాన్ని పవన్ కళ్యాణ్ ఆయన భార్య శ్రీమతి వెంకటేశ్వరమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా కుమార్తెలు ముగ్గురినీ పలకరించిన పవన్ కళ్యాణ్ వారి చదువుల గురించి ఆరా తీశారు. బిడ్డల చదువులకు ఎటువంటి ఆటకం ఏర్పడకుండా జనసేన పార్టీ బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం నుంచి అందాల్సిన రూ. 7 లక్షల నష్టపరిహారం అందేలా అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావుకు సూచించారు. చింతలపూడి నియోజకవర్గం, సుందరరావు పేటకు చెందిన కౌలు రైతు యర్రా రాంబాబు రెండు సంవత్సరాల క్రితం అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డారు. కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా రాంబాబు తల్లి శ్రీమతి సుబ్బమ్మ ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి, పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయం అందచేశారు. తన తండ్రి చనిపోయి రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం తరఫున ఒక్కరు కూడా తమ గడప తొక్కలేదని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎదుట బాధితుని కుమారుడు వాపోయారు. లింగపాలెంకు చెందిన భుక్యా వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి రూ. లక్ష ఆర్ధిక సాయం అందచేశారు. తమ కుమారుడు చనిపోయి ఆరు నెలలు గడచిందని ప్రభుత్వం తరఫున వాలంటీర్ మినహా అదీ పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలిసిన తర్వాత ఫోన్ మాత్రమే చేసిన విషయాన్ని వివరించారు. బలవన్మరణాలకు పాల్పడి జనసేన పార్టీ నుంచి ఆర్ధిక సాయం అందుకున్న ప్రతి కౌలు రైతుకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా ఒత్తిడి తీసుకురావాలని పార్టీ జిల్లా నాయకులను ఆదేశించారు. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

పశ్చిమలో జనసేనానికి అపూర్వ సాగతం:
కౌలు రైతు భరోసా యాత్ర కోసం పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి దారి పొడుగునా పార్టీ శ్రేణులు, ప్రజలు, ఆడపడుచులు అపూర్వ స్వాగతం పలికారు. యాత్ర కోసం కలపర్రు టోల్ గేట్ వద్ద జిల్లాలోకి అడుగు పెట్టిన ఆయనకు వేలాదిగా జనసైనికులు, పార్టీ నాయకులు ఎదురు వచ్చి ఆహ్వానం పలికారు. క్రేన్లు పెట్టి మరీ భారీ గజమాలలు వేసి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రైతులకు అండగా జనసేనాని అంటూ రహదారి మొత్తం హోర్డింగులతో నింపేశారు. ఆడపడుచులు హారతులు పట్టగా, వయసు మళ్లిన వృద్దులు పవన్ కళ్యాణ్ కోసం గంటల తరబడి వేచిచూశారు. ఏలూరు బై పాస్ నుంచి చింతలపూడి వరకు పవన్ కళ్యాణ్ పర్యటనకు తరలివచ్చిన ప్రజలు, జనసైనికులతో కిక్కిరిశాయి. రహదారులతో పాటు రోడ్డుకు ఇరు వైపులా ఉన్న ఇళ్లు కూడా జనంతో నిండిపోయాయి. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు కదిలారు. తూర్పు గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల జనసేన నేతలు కందుల దుర్గేశ్, సుందరపు విజయ్ కుమార్, మర్రెడ్డి శ్రీనివాస్, మేడా గురుదత్ ప్రసాద్, టి.ఉదయ్ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ చెంతకు సమస్యల చిట్టాలు:
కౌలు రైతు భరోసా యాత్ర కోసం పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చిన పవన్ కళ్యాణ్ కి దారిపొడుగునా ప్రజలు తమ సమస్యలు చెప్పుకొన్నారు. విద్యుత్ కోతలు, ఛార్జీల మోతలతో పాటు రైతుల సమస్యలు, అస్థవ్యస్థంగా ఉన్న రహదారుల సమస్యలు, కొంత మంది వ్యక్తిగతంగా తమ ఇబ్బందులను కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. విజయరాయిలో మొక్కజొన్న ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు రోడ్డు మీదకు రాగా, వాహనం నుంచి దిగి మరీ వారిని పేరు పేరునా పలకరించారు పవన్ కళ్యాణ్.

Exit mobile version