ఏపీ రాజకీయాల్లో పిఠాపురం (Pithapuram ) నియోజకవర్గం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ ప్రముఖ నాయకులైన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ (SVSN Varma ) మధ్య నెలకొన్న సంబంధాలు ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటాయి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవడానికి వర్మ ఎంతో సహకారం ఇచ్చారు. ఆయన తన సీటు వదిలి పవన్ కోసం త్యాగం చేసారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నెరవేరకపోవడంతో వర్మలో అసంతృప్తి పెరిగింది. జనసేన నేతలు వర్మపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆయనతో పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ కూడా పెరిగింది.
అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం టూర్‌లో అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ శంఖుస్థాపనలు చేసారు. ఈ కార్యక్రమాలలో టీడీపీ నేత వర్మ కూడా పవన్ వెంట ఉన్నారు.. పవన్ కళ్యాణ్ వెళ్ళిన ప్రతి చోటా వర్మ కూడా ఆయనతోపాటు కనిపించారు. దీంతో టీడీపీ , జనసేన శ్రేణులు వర్మ , పవన్ కలిసిపోయారబ్బా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ ఈ టూర్‌లో వర్మకు మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.