Site icon HashtagU Telugu

Rushikonda : ఉత్తరాంధ్ర భూములు, ఆస్తులపై వైసీపీ నేతల కళ్లు పడ్డాయి – పవన్ కళ్యాణ్

Pawan Kalyan Visits Rushiko

Pawan Kalyan Visits Rushiko

జనసేనాధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి రుషికొండ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన వైసీపీ ప్రభుత్వం , నేతల ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. రుషికొండ అనే కొండ దాని వెనక ఉన్న గ్రామాన్ని తుపాన్లు లాంటి ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతూ ఉందని, అలాంటి కొండను వైసీపీ నేతలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో తెలంగాణను కూడా వీళ్లు ఇలాగే దోపిడీ చేశారని, అందుకే అక్కడి నుంచి తన్ని తగలేశారని .. ఇప్పుడు ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని ఆరోపించారు.

ఉత్తరాంధ్ర భూములు, ఆస్తులపై వైసీపీ నేతల కళ్లు పడ్డాయని , ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను అడ్డగోలుగా దోచుకుంటున్నారని పవన్ విమర్శించారు. సీఎం జగన్ (CM Jagan) ఉండేందుకు ఇంకా ఎన్ని ఇళ్లు కావాలని పవన్ ప్రశ్నించారు. వైసీపీ నేతల దోపిడీ గురించి అందరికీ తెలియాలని, మీడియా కూడా దీనిపై చొరవ చూపాలని కోరారు. చట్టాలను కాపాడాల్సిన సీఎం జగన్ స్వయంగా ఆయనే వాటిని ఉల్లంఘిస్తున్నారని, ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు. శుక్రవారం పవన్ విశాఖలోని రుషికొండకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కొండపైకి వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రుషికొండ (Rushikonda) వద్దకు నడుచుకుంటూ వెళ్లడానికి పవన్ ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు వద్ద నుండి చూడాలని సూచించారు. దీంతో అక్కడి నుండే పరిశీలించారు. కొండను తవ్వడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ వెంట అభిమానులు , పార్టీ నేతలు , కార్యకర్తలు పెద్ద ఎత్తున రుషికొండ వరకు వెళ్లినప్పటికీ , పోలీసులు కేవలం పవన్ కళ్యాణ్ తో పాటు మరికొంతమందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే వాహనాలను సైతం వెళ్లనివ్వలేదు. మొత్తం మీద పవన్ రుషికొండ పర్యటన ఉద్రిక్తతల నడుమ కొనసాగింది.

మరోపక్క పవన్ కళ్యాణ్ కు విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారాహి విజయయాత్రలో భాగంగా గురువారం జగదాంబ సెంటర్‌లో జరిగిన సభలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ అభియోగాలు దాఖలు చేశారు. ఈ మేరకు విశాఖ తూర్పు ఏసీపీ మూర్తి… జనసేనానికి నోటీసులు జారీ చేశారు. బహిరంగ సభల్లో బాధ్యతగా మాట్లాడాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. విద్వేష వ్యాఖ్యలు చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈ సభలో వాలంటీర్లు, ఆంధ్రా యూనివర్సిటీపై ఆరోపణలు చేసిన జనసేనానికి సెక్షన్ 30 కింద నోటీసులు జారీ చేసారు.

Read Also : Hyderabad: సిటీ శివారులో రెచ్చిపోతున్న దొంగలు.. 30 తులాల బంగారం చోరీ